పళనికే పగ్గాలు.. పన్నీరు వెంట పట్టుమని పదిమంది కూడా లేరు.. గవర్నర్‌దే నిర్ణయం

గురువారం, 16 ఫిబ్రవరి 2017 (10:13 IST)
తమిళనాడు రాజకీయ అనిశ్చితికి గురువారం తెర పడే సూచనలు కనిపిస్తున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ఏఐడీఎంకె శాసన సభాపక్ష నేత పళని స్వామికి  గవర్నర్ విద్యాసాగర రావు అపాయింట్‌మెంట్ ఇచ్చారు. న్యాయ నిపుణుల సలహా మేరకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు.

రాజ్ భవన్ నుంచి గురువారం మధ్యాహ్నం అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. తనకు 120 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని అంటూ పళని వారి సంతకాలతో కూడిన లేఖను గవర్నర్‌కు అందజేశారు. ఇంతవరకు మౌనం వహించిన గవర్నర్ శుక్రవారం ఫ్లోర్ టెస్ట్‌కు అదేశించే అవకాశం ఉందని సమాచారం. 
 
అయితే అటార్నీ జనరల్ ముఖుల్ రోహత్గీ సూచించిన సమగ్ర ఫ్లోర్ టెస్టా? లేక మరో రూపంలో బల పరీక్ష ఉంటుందా? అన్నది తెలియాల్సి ఉంది. బుధవారం గవర్నర్‌ను పన్నీర్ సెల్వం, పళనిస్వామి విడివిడిగా కలిశారు. తనకు 125 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని పళని చెప్పారు. అయితే పన్నీర్ మాత్రం 10 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడా చూపించలేకపోయారు. దీంతో గవర్నర్ ఆలోచనలో పడినట్లు సమాచారం. 
 
శశికళ వర్గం ఎమ్మెల్యేలు ఇంకా రిసార్ట్స్‌లోనే ఉన్నారు. కాగా చిన్నమ్మ జైలు నుంచే పెత్తనం చెలాయిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా పన్నీరుకు మద్దతిచ్చే ఎమ్మెల్యేల సంఖ్య పెద్దగా కనిపించట్లేదు. దీంతో పళనికే సీఎం పగ్గాలు చేతబూనే అవకాశం ఉన్నట్లు సమాచారం. 

వెబ్దునియా పై చదవండి