పన్నీర్‌సెల్వంకు పదవీగండం? తమిళనాడు ముఖ్యమంత్రిగా శశికళ?

మంగళవారం, 20 డిశెంబరు 2016 (09:01 IST)
తమిళనాడు ఆపత్కాల ముఖ్యమంత్రిగా ముచ్చటగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన ఓ.పన్నీర్ సెల్వంకు పదవీగండం తప్పేలా లేదు. ఆయన స్థానంలో ముఖ్యమంత్రి దివంగత జయలలిత వారసురాలిగా ఎన్నికైన శశికళ బాధ్యతలు చేపట్టాలని అన్నాడీఎంకే ఎమ్మెల్యేలంతా ముక్తకంఠంతో కోరుతున్నారు. దీంతో ముఖ్యమంత్రి పదవికి ఓ.పన్నీర్ సెల్వం రాజీనామా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
 
జయలలిత సన్నిహితురాలు శశికళకు పార్టీ పగ్గాలు అప్పజెప్పడం దాదాపు ఖాయమైపోయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడామెను సీఎం పీఠంపై కూర్చోబెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత గత 5వ తేదీ అర్థరాత్రి మరణించిన విషయం తెల్సిందే. అదేరోజు రాత్రి ముఖ్యమంత్రి పీఠం పన్నీరుసెల్వం, పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి శశికళకు అప్పగించేలా నేతల మధ్య ఒప్పందం కుదిరింది. 
 
జయలలిత తుదిశ్వాస విడవడానికి గంట ముందే, ఆమె చికిత్స పొందుతున్న గది పక్కనే జరిగిన సమావేశంలో నేతలు ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకున్నట్టు వార్తలు రావడంతో తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. దాంతో జయ మృతిచెందిన కొన్ని గంటల్లోనే పన్నీరుసెల్వం సీఎంగా ప్రమాణస్వీకారం చేయగా, శశికళ పగ్గాలు చేపట్టేందుకు ఇంకా ముహూర్తం ఖరారు కాలేదు. ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టేందుకు ఆమెకు సభ్యత్వ కాలం ఆటంకమయ్యేలా ఉండడంతో, పార్టీ నిబంధనలను కూడా మార్చేందుకు నేతలు సిద్ధమయ్యారు. 
 
ఇదేసమయంలో శశికళే పగ్గాలు చేపట్టాలంటూ పార్టీకి చెందిన జిల్లా కార్యవర్గాలు, వివిధ విభాగాల వారు ఏకగ్రీవంగా తీర్మానాలు ఆమోదించి అధిష్టానానికి పంపేందుకు ఎవరికి వారు పోటీ పడుతున్నారు. దీంతో ఈ నెలాఖరు లోపు ఆమెను పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం ఖాయమైపోయింది. పార్టీ పగ్గాలు చేపట్టేందుకు శశికళకు అడ్డుగా ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోవడంతో ఆమె సన్నిహితులు ఇప్పుడు సీఎం పీఠంవైపు దృష్టి సారించారు. ముఖ్యమంత్రి పీఠంపై శశికళను కూర్చోబెట్టే వ్యూహంలో భాగంగా మెల్లిగా పావులు కదుపుతున్నారు. అయితే, ముఖ్యమంత్రి బాధ్యతల నుంచి ఓపీఎస్ తప్పుకుంటారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. 

వెబ్దునియా పై చదవండి