ఉభయ సభలను కుదిపేస్తున్న ఆదానీ ఎపిసోడ్ - ఆరో తేదీకి వాయిదా

శుక్రవారం, 3 ఫిబ్రవరి 2023 (17:01 IST)
పార్లమెంట్ ఉభయ సభలను ఆదానీ ఎపిసోడ్ కుదిపేస్తున్నాయి. హిండెన్ బర్గ్ నివేదికగా ఆదానీ ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన గ్రూపు షేర్ల ఎఫెక్ట్ రెండో రోజు కూడా కొనసాగింది. దీంతో ఉభయ సభల కార్యకలాపాలు స్తంభించాయి. 
 
అదానీ గ్రూప్‌ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని పరిశోధక సంస్థ హిండెన్‌బర్గ్‌ ఆరోపణలపై చర్చ జరపాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఇది కాస్తా పార్లమెంట్‌లో గందరగోళ పరిస్థితులకు దారితీసింది. దాంతో సోమవారం వరకు ఉభయ సభలు వాయిదా పడ్డాయి.
 
ఈ బడ్జెట్‌ సమావేశాల్లో అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్‌ ఇచ్చిన నివేదికపై దర్యాప్తు చేపట్టాల్సిందేనని విపక్షాలు పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) లేదా సీజేఐ ఆధ్వర్యంలోని కమిటీతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తున్నాయి. 
 
అయితే, విపక్ష సభ్యుల డిమాండ్‌ను స్పీకర్ తోసిపుచ్చారు. సభ్యుల నిరాధారమైన ఆరోపణలు చేయకూడదన్నారు. మరోవైపు రాజ్యసభ ఛైర్మన్ కూడా విపక్షాల వాయిదా తీర్మానాలను తోసిపుచ్చారు. దాంతో ప్రతిపక్ష నేతలు నినాదాలు చేశారు. ఈ గందరగోళ పరిస్థితుల మధ్య రాజ్యసభ మధ్యాహ్నం 2.30 గంటల వరకు, లోక్‌సభ మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా పడింది. 
 
తర్వాత మళ్లీ కార్యాకలాపాలు ప్రారంభమైనప్పటికీ.. విపక్షాల నుంచి అదే డిమాండ్ వినిపించింది. దాంతో ఎలాంటి చర్చ లేకుండానే పార్లమెంట్ సోమవారానికి వాయిదాపడింది. శని, ఆదివారాలు సభకు సెలవు కావడంతో ఉభయ సభలు మళ్లీ సోమవారమే తిరిగి సమావేశమవుతాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు