విగ్గులో 5 కేజీల బంగారం అక్రమ రవాణా.. ఎలా?

సోమవారం, 22 మార్చి 2021 (08:56 IST)
చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమ స్మగ్లింగ్ గుట్టును కస్టమ్స్ అధికారులు రట్టు చేశారు. నెత్తిపై ధరించిన విగ్గులో దాచి ఏకంగా ఐదు కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న వైనాన్ని కనిపెట్టారు. ఈ కేసులో ఏడుగురు వ్యక్తులను కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. 
 
ఆదివారం జరిగిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, ఆదివారం దుబాయ్, షార్జా నుంచి రెండు ప్రత్యేక విమానాలు చెన్నై చేరుకున్నాయి. అందులో వచ్చిన ప్రయాణికుల్లో కొందరి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో కస్టమ్స్ అధికారులు ప్రతి ఒక్క ప్రయాణికుడిని తనిఖీ చేశారు. 
 
ఈ తనిఖీల్లో ఓ వ్యక్తి తలకు ధరించిన విగ్గుపై అనుమానం కలిగింది. దీంతో ఆ విగ్గును తీసుకుని నిశితంగా పరిశీలించారు. ఇందులో బంగారం పేస్ట్, ముడి బంగారం దాచిన విషయం గుర్తించారు. మొత్తం ఐదు కేజీల మేరకు ఈ బంగారం ఉంటుంది. దీని మొత్తం విలువ రూ.2.53 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. 
 
అలాగే, అదే సమయంలో చెన్నై నుంచి షార్జాకు అక్రమంగా తీసుకెళ్లేందుకు తెచ్చిన రూ.24 లక్షల విలువైన విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండు కేసుల్లో చెన్నై, తిరుచ్చి, రామనాథపురం, విళుపురం, సేలం జిల్లాలకు చెందిన ఏడుగురుతో సహా మొత్తం 11 మందిని అరెస్టు చేశారు. వీరిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు