పవన్ కళ్యాణ్ రీల్ హీరో కాదు.. రియల్ హీరో .. పోరాట యోధుడు : చంద్రబాబు

వరుణ్

గురువారం, 11 ఏప్రియల్ 2024 (09:08 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రశంసల వర్షం కురిపించారు. పవన్ కళ్యాణ్ ఓ సినీ హీరో మాత్రమే కాదని, రియల్ హీరో అని అన్నారు. వెస్ట్ గోదావరి జిల్లా తణుకులో ఏర్పాటు చేసిన ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు. ప్రజాగళం ప్రభజనం ధాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైకాపా అనే వైరస్ పీడ కొట్టుకుపోవడం ఖాయమన్నారు. ప్రజాగ్రహానికి వాయువు తోడైందంటూ పక్కనే ఉన్న పవన్ కల్యాణ్‌ను చూపించారు. తణుకు సభ సాక్షిగా చెబుతున్నా సైకిల్ స్పీడుకు ఎదురులేదు, గ్లాసు జోరుకు తిరుగులేదు, కమల వికాసానికి అడ్డే లేదు అని అభివర్ణించారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మూడు పార్టీలు చేతులు కలిపాయి... మూడు పార్టీల జెండాలు వేరైనా అజెండా ఒక్కటేనని అన్నారు.
 
పదేళ్ల కిందట రాష్ట్ర విభజన కష్టాలు పోగొట్టేందుకు మూడు పార్టీలు కలిశాయని తెలిపారు. మళ్లీ ఇప్పుడు జగన్ కబంధ హస్తాల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మళ్లీ కలిశామని స్పష్టం చేశారు. కలిసింది మామూలు వ్యక్తులు కాదు... అనుభవం ఉన్న నేను, తపన ఉన్న పవన్ కల్యాణ్, దేశాన్ని నెంబర్ వన్‌గా ప్రపంచపటంలో నిలపాలని కృషి చేసే నరేంద్ర మోడీ కలిశాం... ఇక మాకు తిరుగుంటుందా? అని ప్రశ్నించారు.
 
పవన్ కల్యాణ్ ఒక సినిమా హీరో మాత్రమే కాదు, కోట్ల రూపాయల ఆదాయాన్ని, సుఖవంతమైన సినీ జీవితాన్ని వదులుకుని ప్రజల కోసం నిలబడిన నిజమైన హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అని చంద్రబాబు కొనియాడారు. పవన్ కళ్యాణ్‌పై వైసీపీ నేతలు వ్యక్తిగత దాడులు చేశారు... అయినా అనేక అవమానాలను, దాడులను తట్టుకుని నిలబడిన పోరాట యోధుడు పవన్ కల్యాణ్ అని వివరించారు.
 
తాను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు బేషరతుగా వచ్చి తన కోసం పనిచేసిన వ్యక్తి పవన్ కల్యాణ్... తాను గానీ, తెలుగుదేశం పార్టీ గానీ ఈ విషయాన్ని ఎప్పటికీ మర్చిపోం అని పేర్కొన్నారు. చీకటిపాలనను అంతం చేసే క్రమంలో ఓటు చీలనివ్వబోమని మొదట చెప్పిన వ్యక్తి పవన్ కల్యాణ్ అని అన్నారు. మన సంకల్పానికి కేంద్ర సహకారం అవసరం. అలాంటి సంకల్పానికి నరేంద్ర మోడీ నుంచి మద్దతు లభిస్తోంది అని చంద్రబాబు వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు