లాక్డౌన్ విధించం కానీ... లాక్డౌన్‌లాంటి పరిస్థితులు : ప్రధాని మోడీ

బుధవారం, 21 ఏప్రియల్ 2021 (08:30 IST)
దేశంలో కరోనా వైరస్ ప్రజలపై సునామీలా విరుచుకుపడింది. ఫలితంగా లక్షలాది మంది ప్రజలు ఈ వైరస్ బారినపడుతున్నారు. ఆస్పత్రుల్లోని పడకలన్నీ ఫుల్ అయ్యాయి. ఆక్సిజన్ సిలిండర్లు నిండుకున్నాయి. దేశంలో ఒక విధమైన భయానకమైన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ జాతినుద్దేశించి ప్రసంగించారు. 
 
మహమ్మారి విలయతాండవం నేపథ్యంలో గత కొన్ని రోజులుగా ఆయన  వివిధ వర్గాలతో విస్తృత స్థాయిలో చర్చలు జరుపుతున్నారు. అందులో భాగంగా నేడు వ్యాక్సిన్‌ తయారీ పరిశ్రమ ప్రతినిధులతో చర్చించారు. కొన్ని రోజుల క్రితం కాస్త తగ్గుముఖం పట్టిన మహమ్మారి మరోసారి తుపాన్‌లా విరుచుకుపడుతోందని ప్రధాని తెలిపారు. 
 
అందరం కలిసి కట్టుగా దీనిపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కరోనాను అంతమొందించే పోరులో ముందున్న ఫ్రంట్‌లైన్‌ వర్కర్లను ప్రశంసించారు. తమ వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి మరీ వారు దేశం కోసం పోరాడుతున్నారని తెలిపారు. గత కొన్ని రోజులుగా ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు పరిస్థితిని అదుపులోకి తీసుకొస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 
 
దేశవ్యాప్తంగా ఆక్సిజన్‌కు డిమాండ్‌ ఉందని తెలిపారు. దేశవ్యాప్తంగా అవసరమున్న ప్రతిఒక్కరికీ ఆక్సిజన్‌ అందేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఆక్సిజన్‌ ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే ఔషధాల తయారీని పెంచేందుకు సైతం తగిన చర్యలు చేపట్టామన్నారు. ఈ క్రమంలో ఔషధ తయారీ సంస్థలు విశేషంగా కృషి చేస్తున్నాయన్నారు.
 
ప్రతి ఒక్కరికీ వీలైనంత త్వరగా టీకా అందించేందుకు కృషి జరుగుతోందన్నారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా టీకాలు అందిస్తున్న దేశంగా భారత్‌ కొనసాగుతోందన్నారు. వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ద్వారా ఇప్పటికే వైద్యారోగ్య సిబ్బందికి ఫలాలు అందుతున్నాయన్నారు. మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన వారందరికీ టీకా అందించనున్నామని తెలిపారు.
 
ముఖ్యంగా, వలస కార్మికులు ఎక్కడి వారక్కడే ఉండాలని, వారి జీవనోపాధిపై ఎలాంటి ప్రభావం పడకుండా చూస్తామని హామీ ఇచ్చారు. వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడానికి పౌరులు, ముఖ్యంగా యువత ముందడుగు వేయాలని కోరారు. అప్పుడు లాక్డౌన్ అనే ప్రశ్నే ఉత్పన్నమవదన్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దన్నారు. 
 
"ఇవ్వాళ నవరాత్రి చివరి రోజు. రేపు రామ నవమి. పురుషోత్తముడైన రాముడు క్రమశిక్షణతో ఉండాలని మనకి సందేశం ఇచ్చాడు. ఇక రంజాన్‌ మాసంలో ఏడో రోజు వచ్చింది. ఈ పండగ కూడా మనకు సహనం, క్రమశిక్షణ గురించే చెబుతుంది. కొవిడ్‌పై పోరుకు కూడా ఓర్పు, క్రమశిక్షణే అవసరం" అని మోడీ వ్యాఖ్యానించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు