ప్రపంచంలో అమెరికా, రష్యా, చైనా తర్వాత యాంటీ శాటిలైట్ పరీక్షను విజయవంతంగా చేపట్టిన దేశంగా భారత్‌కు గుర్తింపు దక్కింది. ఏ-శాట్ మిషన్ భూమికి అతిసమీక్ష కక్ష్యలో తిరుగుతున్న శాటిలైట్‌ను మూడు నిమిషాల్లోనే విజయవంతంగా కూల్చివేసింది. మోదీ ప్రసంగం అనంతరం ‘మిషన్ శక్తి’కి సంబంధించిన వివరాల కోసం చాలా మంది శోధించడం ప్రారంభించారు.
భారతదేశం అంతరిక్ష యాత్రలో దూసుకుపోతూ అగ్ర దేశాల సరసన నిలుస్తోంది. గత ఐదేళ్లుగా భారత్ అంతరిక్ష ప్రయోగాలతో విశేష కీర్తిని గడిస్తోంది. మంగళ్‌యాన్‌ను విజయవంతంగా చేపట్టిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ.. గగన్‌యాన్ ద్వారా అంతరిక్షంలోకి భారతీయులను పంపేందుకు కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో మన అంతరిక్ష సంపదను సురక్షితంగా ఉంచే సామర్థ్యాలను పరీక్షించేందుకు ఈ ప్రయోగాన్ని భారత్ చేపట్టింది.
మార్చి 27, 2019న భారత్ యాంటీ శాటిలైట్ క్షిపణి ప్రయోగమైన ‘మిషన్ శక్తి’ని అబ్దుల్ కలామ్ ప్రయోగ కేంద్రం నుంచి పరీక్షించింది. ఈ ప్రయోగాన్ని డీఆర్‌డీఓ నిర్వహించింది. ఇది పూర్తిగా విజయవంతమై తనకు నిర్దేశించిన లక్ష్యాలను ఛేదించింది.