బెంగుళూరులో ఆసియాలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శన

సోమవారం, 13 ఫిబ్రవరి 2023 (11:31 IST)
ఆసియా ఖండంలోనే బెంగుళూరు కేంద్రంగా అతిపెద్ద వైమానిక ప్రదర్శన సోమవారం నుంచి జరుగనుంది. మొత్తం ఐదు రోజుల పాటు సాగే ఈ వైమానిక ప్రదర్శన బెంగుళూరులోని యలహంక వైమానిక స్థావరంలో ఏరో ఇండియా 2023 పేరుతో నిర్వహిస్తున్నారు. ఈ 14వ ఏరో ఇండియా షోను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. 
 
ఈ సందర్భంగా వివిధ దేశాల రక్షణ సంస్థలతో పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. కాగా, ఏయిర్‌షోలో 98 దేశాలకు చెందిన 809 రక్షణ, వైమానిక రంగ ప్రదర్శనకారులు పాల్గొంటారు. ఈ నెల 16, 17 తేదీల్లో వైమానిక ప్రదర్శన చూసేందుకు సాధారణ పౌరులకు కూడా అవకాశం కల్పించారు. అయితే, ఒక్కో టిక్కెట్ ధరను రూ.1000గా నిర్ణయించారు. దీంతో పేద, మధ్యతరగతి ప్రజలు ఈ వైమానిక ప్రదర్శనను తిలకించే వీలులేకుండా పోయింది. 
 
ఈ ప్రదర్శనంలో భారతీయ, విదేశీ రక్షణ రంగ సంస్థలు ప్రదర్శనలో తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నాయి. వీటిలో ఎయిర్‌బస్, బోయింగ్, లాక్హీడ్, మార్టిన్, ఇజ్రాయేల్ ఏరోస్పేస్, బ్రహ్మోస్ ఏరోస్పేస్, ఆర్మీ ఏవియేషన్, హెచ్‌సీ రోబోటిక్స్, సాబ్, సఫ్రాన్, రోల్స్ రాయిస్, ఎల్ అండ్ టీ, భారత్ ఫోర్జ్ లిమిటెడ్, హెచ్ఏఎల్, బీఈఎల్, బీడీఎల్, బీఈఎంఎల్ సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తాయి.
 
ముఖ్యంగా, ఇండియన్ పెవిలియన్ ద్వారా 115 సంస్థలు 227 ఉత్పత్తులను ప్రదర్శించేందుకు సిద్ధంగా ఉన్నాయి. అందులే ఎల్సీఏ తేజస్, డిజిటల్ ఫ్లై బై, మల్టీ రోల్ సూపర్ సోనిక్ ఫైటర్‌తో పాటు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యాలతో తయారైన ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు