దేశంలోనే అతిపెద్ద రాష్ట్రంగా ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు వచ్చే యేడాది ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తం 403 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఈ రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం నోటిఫికేషన్ కూడా జారీచేసింది. ఈ నేపథ్యంలో ఇండియా టుడే - యాక్సిస్ సంస్థలు సంయుక్తంగా ఓ సర్వేను నిర్వహించాయి. ఈ సర్వేలో యూపీలో బీజేపీ పాగా వేస్తుందని వెల్లడైంది. మొత్తం 403 సీట్లలో బీజేపీకి 206 నుంచి 216 సీట్లు వరకు వస్తాయని పేర్కొంది. ముఖ్యంగా దేశంలో పెద్ద నోట్ల రద్దు చర్య ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి మేలేచేస్తుందని వివరించింది.
ఈ సర్వేను గత అక్టోబరు, డిసెంబరు నెలల్లో నిర్వహించాయి. నోట్ల రద్దుతో ఓటర్లపై ప్రతికూల ప్రభావంపడే అవకాశముందన్న అంచనాలను ఈ సర్వే ఫలితాలు తోసిపుచ్చాయి. గత అక్టోబరు (నోట్ల రద్దుకు ముందు)తో పోలిస్తే డిసెంబరు నాటికి భాజపా ఓటు బ్యాంకు 2 శాతం (31 నుంచి 33 శాతానికి) పెరిగినట్లు తెలిపాయి. 2012లో భాజపాకు 15 శాతం ఓట్లే (47 అసెంబ్లీ స్థానాలు) దక్కాయి.
ప్రస్తుత ఎన్నికల్లో అధికార సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)కి రెండో స్థానం దక్కుతుందని సర్వే తెలిపింది. 26 శాతం ఓట్లతో 92 నుంచి 97 స్థానాల్లో పార్టీ విజయం సాధిస్తుందని పేర్కొంది. ఓట్ల విషయంలో ఎస్పీకి బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) గట్టి పోటీ ఇస్తుందని వివరించింది. అయితే బీఎస్పీకి 79 నుంచి 85 స్థానాలు మాత్రమే దక్కుతాయని అంచనావేసింది.
27 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వానికి దూరంగా జరిగిపోయిన కాంగ్రెస్‌కు ప్రస్తుతం రెండంకెల సీట్లు కూడా దక్కవని పేర్కొంది. పార్టీకి ఆరు శాతం ఓట్లతో ఐదు నుంచి తొమ్మిది స్థానాలే వస్తాయని తెలిపింది. రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్‌ఎల్‌డీ), అప్నా దళ్, వామపక్షాలు సహా ఇతరులకు ఏడు నుంచి 11 స్థానాలు దక్కే అవకాశముందని వివరించింది.