విజయదశమి పర్వదినాన ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం ఐదు రాష్ట్రాలకు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి కొత్త గవర్నర్లను నియమించారు.
వీరిలో దక్షిణాదిలో అత్యంత కీలకంగా ఉన్న తమిళనాడుకు భన్వరిలాల్ పురోహిత్ , మేఘాలయకు గంగాప్రసాద్, అరుణాలచల్ ప్రదేశ్‌కు బీడీ మిశ్రా, బిహార్‌కు సత్యపాల్ మాలిక్, అస్సోంకు జగదీష్ ముఖీ, అండమాన్ నికోబార్‌కు మాజీ అడ్మిరల్ దేవేంద్ర కుమార్ జోషిని లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమించారు. గతంలో జగదీశ్ ముఖీ అండమాన్ నికోబార్ దీవులకు లెఫ్టినెంట్ గవర్నర్‌గా పనిచేశారు.
కాగా, తమిళనాడు రాష్ట్ర గవర్నర్‌గా ఉన్న కె రోశయ్య పదవీ విరమణ తర్వాత ఆ రాష్ట్ర తాత్కాలిక గవర్నర్‌గా మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు కొనసాగుతూ వచ్చారు. ఈ క్రమంలో తమిళనాడు రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఇపుడు పూర్తి స్థాయి గవర్నర్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది.