దేశ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత తొలిసారి రాంనాథ్ కోవింద్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలు, పథకాల గురించి ఆయన ప్రస్తావించారు. దేశ స్వప్నాలను సాకారం చేసుకునేందుకు కృషి చేయాలని, ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదం పొందుతుందని తాను ఆశిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
అలాగే, పేదలు, ఉన్నత వర్గాల మధ్య అంతరాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని, రైతులకు ప్రభుత్వం అండగా ఉండి, వారి ఆదాయాన్ని పెంచే ప్రయత్నం చేయాలని కోరారు. స్వయం సహాయక బృందాలను ప్రోత్సహిస్తూ, దేశ అభివృద్ధిలో వారిని భాగం చేయాలని రాంనాథ్ కోవింద్ వివరించారు.
ఆదివాసీలు, గ్రామీణులు, వృద్ధులు, దివ్యాంగులు, మహిళలు, మైనార్టీల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు, ప్రయోజనాలు, వాటిలో సాధించిన విజయాల గురించి ఆయన చెప్పారు. ముస్లిం హజ్ యాత్రలో ప్రభుత్వం చేసిన మార్పుల కారణంగా ముస్లిం మహిళలకు ప్రయోజనం చేకూరిందని ఆయన అన్నారు.