పోప్ నివాళి కోసం వాటికన్ సిటీకి వెళ్లిన రాష్ట్రపతి బృందం!!

ఠాగూర్

శుక్రవారం, 25 ఏప్రియల్ 2025 (09:47 IST)
పాప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సారథ్యంలోని భారత బృందం శుక్రవారం వాటికన్ సిటీకి బయలుదేరి వెళ్లింది. ఆమె వెంట కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖామంత్రి కిరణ్ రిజిజు, మైనారిటీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జార్జ్ కురియన్, గోవా అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ జాషువా డిసౌజాలతో పాటు భారత ప్రభుత్వ ప్రతినిధి బృందం ఉంది. 
 
పోప్ ఫ్రాన్సిస్ (88) ఈ నెల 21వ తేదీన కన్నుమూసిన విషయం తెల్సిందే. ఆయన అంత్యక్రియలు ఈ నెల 26వ తేదీన వాటికన్ సిటీలో జరుగనున్నాయి. వీటిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు భారత బృందం పాల్గొంటుంది. ఏప్రిల్ 25, 26వ తేదీల్లో ఆమె వాటికన్‌లో పర్యటిస్తారు. భారత ప్రభుత్వం, ప్రజల తరపున పోప్ ఫ్రాన్సిస్‌కు నివాళులర్పించి, సంతాపం తెలియజేస్తారని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఏప్రిల్ 25వ తేదీన వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ బాసిలికా వద్ద దివంగత పోప్‌కు రాష్ట్రపతి పుష్పాంజలి ఘటిస్తారు. 
 
ఏప్రిల్ 26వ తేదీన సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో జరిగే అంత్యక్రియల్లో ప్రార్థనలకు రాష్ట్రపతి హాజరవుతారు. ఈ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, బ్రిటన్ యువరాజు విలియం, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ సహా పలు దేశాల అధినేతలు, రాజులు, ప్రముఖులు హాజరుకానున్నట్టు వాటికన్ వర్గాలు వెల్లడించాయి. పోప్ అంత్యక్రియల్లో సుమారు 130 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటారని వాటికన్ వర్గాలు అంచనా వేశాయి. 
 
మరోవైపు, పోప్ మృతిపట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేసిన విషయం తెల్సిందే. కరుణ, వినయం, ఆధ్యాత్మిక ధైర్యానికి పోప్ ప్రతీక అంటూ కొనియాడారు. పేదలు, అణగారిన వర్గాల కోసం ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. పోప్ ఫ్రాన్సిస్ గౌరవార్థం అంత్యక్రియలు జరిగే ఏప్రిల్ 26వ తేదీన భారత్‌లో సంతాపదినం పాటించాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన విషయం తెల్సిందే. ఆ రోజున దేశ వ్యాప్తంగా త్రివర్ణ పతాకాన్ని అవనతం చేస్తారు. అలాగే, ఎలాంటి అధికారిక వినోద కార్యక్రమాలను నిర్వహించరు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు