జాతీయ భాషగా హిందీ.. కన్నడ నటుడిని సమర్థించిన కర్ణాటక సీఎం
గురువారం, 28 ఏప్రియల్ 2022 (20:15 IST)
కర్ణాటక రాష్ట్రంలో మరో వివాదం రాజుకుంది. విద్యాలయాల్లో హిజాబ్ అంశం తర్వాత ఇప్పుడు జాతీయ భాషపై చర్చ, వివాదం కొనసాగుతోంది.
కన్నడ సూపర్ స్టార్ సుదీప్, బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్‌ల మధ్య జాతీయ భాషపై జరిగిన చర్చకు ఇప్పుడు కొనసాగింపుగా కన్నడ రాజకీయ నేతలు స్పందిస్తున్నారు. దీనికి తోడు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, సహా ప్రతిపక్ష నేతలు కూడా సుదీప్‌కు మద్దతుగా నిలుస్తున్నారు.
హిందీ జాతీయ భాష కాబట్టే కన్నడ సినిమాలని కూడా హిందీలోకి డబ్ చేస్తున్నారు అంటూ అజయ్ దేవగణ్ చేసిన వ్యాఖ్యల్ని సుదీప్ ఖండించారు. భాషల వల్లే రాష్ట్రాలు ఏర్పడ్డాయని, అన్ని మాతృ భాషలు అత్యున్నతమైనవని, సుదీప్ చేసిన వ్యాఖ్యల్ని తాము సమర్థిస్తున్నామని ముఖ్యమంత్రి సహా ప్రతిపక్ష నేతలు సుదీప్ మద్దతుగా వ్యాఖ్యానించారు.
ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్లే భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయని, సుదీప్ అన్న మాటలు సరైనవే అంటూ, అందరూ వాటిని గౌరవించాలి అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఇక సుదీప్ కి మద్దతుగా మాజీ ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య, కుమారస్వామి కూడా నిలిచారు.
ఇంకా వారు అజయ్ దేవగన్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. హిందీ ఎప్పటికీ మన జాతీయ భాష కాదని, భాష వైవిధ్యాన్ని గుర్తించడం ప్రతి భారతీయుడి కర్తవ్యమని ట్వీట్ చేశారు సిద్ధరామయ్య.
మరోవైపు కన్నడ సినీ నటులు కూడా సుదీప్ అండగా నిలుస్తున్నారు. అజయ్ దేవగణ్ చేసిన వ్యాఖ్యల్ని అహంకారపూరితమైనవనిగా, అజ్ఞానానికి నిదర్శనం అభివర్ణిస్తున్నారు. హిందీ మా జాతీయ భాష కాదు కిచ్చా సుదీప్ సర్ మేము మీకు మద్దతిస్తున్నాం అని ట్వీట్లు చేస్తున్నారు కన్నడ నటులు.
ఇక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఈ అంశం మీద స్పందించారు. భారతదేశం అంతా ఒకటేనని ఉత్తర, దక్షిణాలూ లేవంటూనే శాండల్ వుడ్‌కు చెందిన కేజిఎఫ్ 2 సినిమా ఇటీవల సృష్టించిన రికార్డులను ఉదహరిస్తూ, విడుదలకు సిద్దంగా ఉన్న అజయ్ దేవగణ్ సినిమా గురించి కూడా మాట్లాడాడు ఆర్జీవి.