రాహుల్‌కు మటన్ కూర వంట నేర్పించిన లాలూ ప్రసాద్ యాదవ్

ఆదివారం, 3 సెప్టెంబరు 2023 (10:13 IST)
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మటన్ కూర ఎలా ఉండాలో ఆర్జేడీ చీఫ్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ నేర్పించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. పైగా తనకు కూడా వంట చేయడం వచ్చని, కానీ, పాకశాస్త్ర నిపుణుడిని మాత్రం కాదని లాలూతో రాహుల్ అన్నారు. అలాగే, లాలూగారు మాత్రం అద్భుతంగా వంట చేస్తారు అని ఆయన కితాబిచ్చారు. అద్భుతంగా వంట వచ్చిన భారత రాజకీయనేతల్లో లాలూ ముందుంటారని పేర్కొన్నారు.
 
నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలో రాహుల్ గాంధీకి మటన్ ఎలా వండాలో చెబుతూ లాలూ పలు సూచనలు చేశారు. మటన్‌ను కలపడం, మసాలా జోడించడం.. ఇలా అన్ని విషయాలూ వివరించారు. మటన్ రెడీ అవుతున్న సమయంలో రాహుల్, లాలూ మధ్య ఆసక్తికర సంవాదం కొనసాగింది. రాజకీయాలకు సంబంధించి సీక్రెట్ మసాలా ఏంటని రాహుల్ ప్రశ్నించగా కష్టించి పనిచేయడమేనని లాలూ జవాబిచ్చారు. 
 
అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడాలన్నారు. రాజకీయాల్లో కూడా అన్నీ కలిపేయడం లాలూకు అలవాటు అంటూ జోక్ చేసిన రాహుల్ గాంధీ.. వంటకు, రాజకీయాలకు మధ్య తేడా ఏమిటని లాలూను ప్రశ్నించారు. 'అవును.. నేను అదే చేస్తా. అయితే, కాస్తంత కలపకుండా రాజకీయాలు సాధ్యం కావు' అంటూ లాలూ చమత్కరించారు.
 
మునుపటి నేతలు దేశాన్ని ఓ కొత్త, న్యాయబద్ధమైన మార్గంలో నడిపించారని, ఆ విషయాన్ని యువ నేతలు మర్చిపోకూడదని లాలూ అభిప్రాయపడ్డారు. రాహు‌ల్‌తో పాటూ అక్కడ బీహార్ ఉపముఖ్యమంత్రి, లాలూ తనయుడు తేజస్వీ యాదవ్, సోదరి మీసా భారతి కూడా ఉన్నారు. బీజేపీపై కూడా లాలూ ప్రసాద్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీకి 'రాజకీయ ఆకలి' ఎక్కువని విమర్శించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు