అసెంబ్లీ సమావేశాలకు మోకాలడ్డలేదు... రాజస్థాన్ గవర్నర్

గురువారం, 30 జులై 2020 (15:48 IST)
రాజస్థాన్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు తాను ఎపుడూ అడ్డుపడలేదని ఆ రాష్ట్ర గవర్నర్ కల్రాజ్ మిశ్రా స్పష్టం చేశారు. అయితే, ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం నుంచి వచ్చిన లేఖలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణకుగల ముఖ్యోద్దేశ్యాన్ని స్పష్టంగా చెప్పలేదని ఆయన చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా వచ్చే నెల 14వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలకు అనుమతి ఇచ్చినట్టు ఆయన గుర్తుచేశారు. 
 
ఇదే అంశంపై రాజస్థాన్ రాష్ట్ర గవర్నర్ కల్ రాజ్ మిశ్రా స్పందిస్తూ, "అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలన్న డిమాండ్‌కు నేనెప్పుడూ అడ్డుపడలేదు. పరిస్థితులు సరిగ్గా లేవు కాబట్టే. లేదంటే నేను ఒప్పుకునేవాడినే. సాధారణ అసెంబ్లీ సమావేశాలా? లేక బలపరీక్ష కోసం అసెంబ్లీ సమావేశాలా? అన్నది సీఎం స్పష్టతే ఇవ్వలేదు" అని చెప్పుకొచ్చారు. 
 
అదేసమయంలో రాజ్‌భవన్ ముందు తన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలతో సీఎం గెహ్లోట్ ధర్నాకు దిగడం అత్యంత దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు. 1995లో ఆయన బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రాజ్‌భవన్ ముందు ధర్నా గురించి ప్రస్తావించగా... ఆ ధర్నాకు, గెహ్లాట్ చేసిన ధర్నాకు చాలా తేడా ఉందని కల్రాజ్ మిశ్రా చెప్పుకొచ్చారు. 
 
సీఎం గెహ్లాట్ మెజార్టీ ఉందని చూపించేంత వరకూ ప్రభుత్వంపై తానేమీ వ్యాఖ్యలు చేయనని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర కేబినెట్ నిర్ణయానికి గవర్నర్ కట్టుబడి ఉండాలి కదా అని ప్రశ్నించినపుడు... 'అవును గవర్నర్ రాష్ట్ర కేబినెట్ నిర్ణయానికే కట్టుబడి ఉండాలి. అయితే కోర్టు ఆదేశాలను, నిబంధనలను కూడా శ్రద్ధతో చూడాల్సి ఉంటుంది కదా' అని మిశ్రా చెప్పుకొచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు