రజినీకాంత్‌కు ప్రధాని మోదీపై కోపమా...? అందుకే పార్టీ పెట్టాలనుకుంటున్నారా...?

శుక్రవారం, 19 మే 2017 (16:34 IST)
దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ హఠాత్తుగా రాజకీయ పార్టీ అనే వార్త ఇప్పుడు దేశంలో పెద్ద చర్చగా మారింది. వాస్తవానికి రజినీకాంత్ ఎవ్వరినీ శుత్రువులుగా భావించలేరు. రాజకీయాల్లోకి వస్తే పార్టీ పరంగా శత్రువులు తయారవుతారు. అందువల్ల ఆ పరిస్థితి రాకూడదని ఏకంగా రాజకీయాల్లోకే రాకుండా చాలాకాలంగా వుండిపోతూ వస్తున్నారు. 
 
జయలలిత మరణం... ఆ తర్వాత వరుసగా తమిళనాడు రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు, రాజకీయ నాయకులపై ఐటీ శాఖ దాడులు... ఇలా వరుసగా తమిళనాడును మోదీ టార్గెట్ చేశారనే ప్రచారం కూడా నడిచింది. ఇదిలావుంటే తాజాగా రజినీకాంత్ కేంద్ర మాజీమంత్రి చిదంబరంతో సమావేశం కావడం చర్చనీయాంశమైంది. చిదంబరంతో రజినీకాంత్ గంటలకొద్దీ సంభాషణలు జరిపారు. 
 
తెల్లారగానే చిదంబరంపై సీబీఐ దాడులు జరిగాయి. దేశంలో ఆయన కుటుంబసభ్యులకు చెందిన అన్ని ప్రాంతాల్లోనూ ఏకకాలంలో సీబీఐ దాడులు నిర్వహించింది. దీనిపై రజినీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అందువల్లనే రాజకీయ పార్టీ పెట్టాలనే నిర్ణయానికి వచ్చినట్లు చర్చ జరుగుతోంది. ఐతే మీడియాలో రకరకాల ఊహాగానాలు రావడాన్ని రజినీకాంత్ కొట్టిపారేశారు. అవన్నీ తను పట్టించుకునే దశలో లేనని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు. ఇంతకీ... రజినీకాంత్ నిజంగా ప్రధానమంత్రి మోదీపై కోపంగా వున్నారా..? అనేది ప్రస్తుతం ప్రశ్నగా మారింది.

వెబ్దునియా పై చదవండి