ఆర్కే.నగర్ బరిలో ఇళయరాజా తమ్ముడు.. రజినీకాంత్ మద్దతు ఇస్తారా?

మంగళవారం, 21 మార్చి 2017 (16:32 IST)
చెన్నై, ఆర్కే.నగర్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరపున ప్రముఖ సంగీత దర్శకుడు గంగై అమరన్ పోటీ చేస్తున్నారు. ఈయన సంగీత దిగ్గజం ఇళయరాజా సోదరుడు. పైగా, గంగై అమరన్ బీజేపీ తమిళనాడు శాఖ సాంస్కృతిక విభాగ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్‌ను ఆయన నివాసంలోనే గంగై అమరన్ మంగళవారం కలుసుకున్నారు. తన నివాసానికి వచ్చిన గంగై అమరన్‌కు రజినీ సాదరస్వాగతం పలికారు. అనంతరం ఆయనతో ఫోటో దిగి మీడియాకు విడుదల చేశారు. ఈ సందర్భంగా రజినీ ఆశీస్సులను గంగై అమరన్ కోరినట్టు తెలుస్తోంది. 
 
ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో రజినీకాంత్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి కూడా. ముఖ్యంగా గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రధాని మోడీ స్వయంగా రజినీకాంత్ ఇంటికెళ్లి అల్పాహారం కూడా స్వీకరించారు. దీంతో రజినీకాంత్ బీజేపీకి మద్దతు ఇస్తారని ప్రతి ఒక్కరూ భావించారు. 
 
ఈ పరిస్థితుల్లో ఆర్కే.నగర్ ఉప ఎన్నికల్లో గంగై అమరన్‌ను బరిలోకి దించడం వెనుక మోడీ హస్తమున్నట్టు తెలుస్తోంది. కోలీవుడ్‌లో సౌమ్యుడిగా ముద్రపడిన గంగై అమరన్‌కు చిత్రపరిశ్రమలో ప్రతి ఒక్కరితో సత్ సంబంధాలు ఉన్నాయి. దీనికితోడు వివాదరహితుడు. దీంతో రజినీ వంటి వారు గంగై అమరన్‌కు మద్దతిస్తారని బీజేపీ నేతలు భావిస్తున్నారు. అయితే, ఈ విషయంపై రజినీకాంత్ అధికారికంగా స్పందించాల్సి వుంది. 

వెబ్దునియా పై చదవండి