స్వాతి హత్య కేసులో నిందితుడని ఆరోపణలు ఎదుర్కొని పుళల్ జైలులో ఆత్మహత్యకు పాల్పడిన రామ్ కుమార్‌కు మావోయిస్టులకు మధ్య సంబంధాలున్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. కరూరులో గత జూలైలో అరెస్టయిన మావోలు ఇద్దరూ శుక్రవారం కోర్టులో హాజరైనప్పుడు స్వాతి హత్య కేసు నిందితుడు రామ్‌కుమార్‌ను పోలీసులే హత్య చేశారంటూ నినాదాలు చేసి సంచలనం సృష్టించారు. కరూర్‌లో టెక్స్‌టైల్ దుకాణంలో కళా (52), చంద్రా (45) అనే ఇద్దరు మహిళలు పనిచేస్తూ రహస్యంగా మావోయిస్టు తీవ్రవాద కార్యకలాపాలను నిర్వహిస్తుండేవారు.
గత జూలై 21న వీరిని క్యూ బ్రాంచి పోలీసులు అరెస్టు చేసి తిరుచ్చి జైలుకు తరలించారు. వీరి కస్టడీని పొడిగించేందుకు ఇరువురినీ తిరుచ్చి జైలు నుంచి కరూరు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరిచారు. ఆ సమయంలో ఆ ఇరువురు మహిళలు బిగ్గరగా రామ్‌కుమార్‌ను చెన్నై సెంట్రల్ జైలులో పోలీసులే హత్య చేశారంటూ నినాదాలు చేశారు. దీంతో కోర్టు ప్రాంగణమంతా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.