మహిళా రోగికి నేలపైనే భోజనం... మానవత్వమా... ఏది నీ చిరునామా...?

శనివారం, 24 సెప్టెంబరు 2016 (17:42 IST)
ఇటీవలి కాలంలో మానవత్వాన్ని మంటగలిపే సంఘటనలు కనిపిస్తున్నాయి. ఆమధ్య కన్నకొడుకు తీవ్ర అనారోగ్యంతో ఉంటే ఆసుపత్రిలో చేర్చుకునేందుకు నిరాకరించడంతో పాటు కనీసం అంబులెన్స్ సౌకర్యాన్ని కూడా కల్పించకపోవడంతో ఓ బాలుడు మరణించాడు. ఇలాంటి ఘటనలు వరుసగా దేశంలో ఆయా ఆసుపత్రుల్లో చోటుచేసుకుంటున్నాయి. తాజాగా జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో మరో దారుణం జరిగింది. వివరాల్లోకి వెళితే... ఓ రోగికి కుడిచేయి విరగడంతో ఆమె ఆసుపత్రిలో చేరింది. 
 
భోజనం వేళ ఆమె అన్నం కోసం వెళితే పళ్లెం ఇవ్వలేదు. సొంత పళ్లెం తెచ్చుకోవాలని చెప్పారు. ఐతే తనకు పళ్లెం లేదని చెప్పడంతో... అయితే తిను అంటూ నేలపైనే భోజనం పెట్టేశారు. ఆకలితో అలమటిస్తున్న ఆ మహిళ కూరలన్నీ కలుపుకుని నేలపైనే కలుపుకుని భోజనం చేసింది. ఈ ఘటన తాలూకు ఫోటోను ఓ జాతీయ దినపత్రిక ప్రచురించడంతో ఈ ఘటనకు కారణమైన సిబ్బందిపై అధికారులు వేటువేశారు.

వెబ్దునియా పై చదవండి