సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ గురువారం రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభలో ప్రతిపక్షాల నిరసనల మధ్య గొగోయ్ ప్రమాణ స్వీకారం జరిగింది. సుప్రీం చీఫ్ జస్టిస్ పదవి నుంచి రిటైరైన నాలుగు నెలల్లోనే ఆయన రాజ్యసభ సభ్యత్వం తీసుకోవడం దేశ న్యాయ వ్యవస్థ స్వతంత్రతకు దెబ్బ అంటూ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నిరసన వ్యక్తం చేసింది. అయితే గొగోయ్ మాత్రం తన సభ్యత్వాన్ని సమర్థించుకున్నారు. తాను రాజ్యసభ సభ్యుడు కావడం వల్ల పార్లమెంటులో న్యాయ వ్యవస్థకు సంబంధించిన విషయాలు చర్చించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
సమర్థించుకున్న బీజేపీ.. కాంగ్రెస్ వాకౌట్
మాజీ చీఫ్ జస్టిస్ రంజన్ గగోయ్‌ను రాజ్యసభకు నామినేట్ చేస్తూ కొన్ని రోజుల కిందే రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం గగోయ్ రాజ్యసభలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సమయంలో కాంగ్రెస్ సభ్యులు సభలో నిరసన వ్యక్తం చేశారు. గగోయ్ ప్రమాణ స్వీకారం చేస్తుండగానే మధ్యలో వాకౌట్ చేశారు.