ఇటీవలి కాలంలో వాట్సాప్‌లో అత్యాచార వీడియోలు ప్రచారమవుతున్నాయి. దీనిపై హైదరాబాద్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ 'ప్రజ్వల' గతంలో సుప్రీంకోర్టుకు లేఖరాసింది. ఈ లేఖతోపాటు వాట్సాప్‌లో ప్రచారంలో ఉన్న రెండు అత్యాచార వీడియోలను పెన్ డ్రైవ్ ద్వారా అప్పటి చీఫ్ జస్టిస్ హెచ్.ఎల్.దత్తుకు పంపించింది. కోర్టు దీనిని సుమోటోగా స్వీకరించింది. కేసు దర్యాప్తు చేసి నిందితులను అదుపులోకి తీసుకోవాలని ఆదేశించింది.
అలాగే సామాజిక మాధ్యమాల్లో అశ్లీల దృశ్యాలు ప్రచారం కాకుండా నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర సమాచార, ప్రసారశాఖను ఆదేశించింది. ఈ ఆదేశాలు జారీ చేసి 11 నెలలు గడుస్తున్నా కేంద్రం నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంపై జస్టిస్ ఎంబీ లోకూర్, జస్టిస్ యూయూ లలిత్‌తో కూడి ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ శుక్రవారానికి కేసును వాయిదా వేసింది.