2002 నాటి గోద్రా అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై జరిగిన అత్యాచార ఘటనలో దోషులను గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వం విడుదల చేసింది. జైలు నుంచి విడుదైలన తర్వాత వీరికి బయట ఘనస్వాగతం పలికింది. వీరికి పూలమాలలు వేసి ఘన సన్మానం కూడా చేశారు. ఇదే దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఇలాంటి అత్యాచారం దోషులను విడుదల చేయడాన్ని ప్రతి ఒక్కరూ తీవ్రంగా తప్పుబడుతున్నారు.
ఈ కోవలోనే మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ స్పందించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత అత్యాచార కేసులోని ముద్దాయిలకు ఘన స్వాగతం పలకడం ముమ్మాటికీ తప్పేనని చెప్పారు. దోషి అంటే దోషేనని, వారికి సన్మానాలు జరపడం సరికాదన్నారు. సుప్రీంకోర్టు ఆర్డర్ మేరకు దోషులను విడుదల చేశారని ఆయన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. అందువల్ల ఈ అంశాన్ని చట్టసభల్లో చర్చించడం అనవసరమని ఫడ్నవిస్ అభిప్రాయపడ్డారు.