జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామా ఆత్మాహుతి దాడిలో అమరులైన సైనికుల కుటుంబాలను ఆదుకునేందుకు రిలయన్స్ ఫౌండేషన్ ముందుకు వచ్చింది. పుల్వామా ఘటనలో ప్రాణాలు కోల్పోయిన సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలకు అన్ని విధాలా ఆదుకునేందుకు ప్రముఖ రిలయన్స్ గ్రూప్ వారి ఫౌండేషన్ సిద్ధమని ప్రకటించింది. ఈ మేరకు శనివారం రిలయన్స్ ఓ ప్రకటనను విడుదల చేసింది.
పుల్వామా ఘటనలో అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్ల వారసులను విద్య, ఉపాధి కల్పించడంతో పాటు వారికి జీవితాంతం తోడుందుకు సిద్ధమని.. ఇంకా వారి కుటుంబ సభ్యులకు అన్నివిధాలా సహకరిస్తామని, తగిన సౌకర్యాలు కల్పిస్తామని రిలయన్స్ ఫౌండేషన్ హామీ ఇచ్చింది.
జైషే మొహమ్మద్ ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడింది. పేలుడు పదార్థాలతో ఉన్న కారు సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌లోకి చొరబడి విధ్వంసాన్ని సృష్టించింది. 2,500 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు 78 బస్సుల్లో జమ్మూ నుంచి శ్రీనగర్‌కు కాన్వాయ్‌గా వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది.