రాకెట్‌లలో వాడే ఇంధనాన్ని కూడా బాంబులుగా తయారు చేయనున్నారు. ఈ దిశగా భారత వాయుసేన పరిశోధనలు చేస్తోంది. అంటే బాంబులతో పాటు రాకెట్ కూడా పేలిపోవటంతో శక్తివంతమైన పేలుడు సంభవిస్తుంది. ఫలితంగా తక్కువ సమయంలోనే శత్రువుల స్థావరాలను నామరూపాల్లేకుండా చేసి కోలుకోలేని దెబ్బకొట్టవచ్చు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుపై వాయుసేన విస్త్రృత పరిశోధనలు చేస్తోంది.
ఈ ప్రాజెక్టు తొలి దశలో భాగంగా, ద్వంద్వ వినియోగ ఇంధన ఫార్ములా రూపొందించాల్సిందిగా కాంట్రాక్టర్లను ఆహ్వానించింది. నిజానికి ఈ తరహా ఆలోచన ఈనాటికి కాదు. గతంలోనూ ద్వంద్వ వినియోగ ఇంధన రాకెట్లను పలు సందర్భాల్లో వినియోగించారు.
1982లో యునైటెడ్ కింగ్‌డమ్, అర్జెంటీనా మధ్య జరిగిన ఫాక్లాండ్స్ యుద్ధంలో హెచ్‌ఎంఎస్ షెఫీల్డ్ యుద్ధ నౌకపై రాకెట్ బాంబులతో అర్జెంటీనా దాడి చేసింది. ఆ సమయంలో బాంబులతో పాటు రాకెట్ ప్రొపెల్లెంట్ కూడా పేలిపోవటంతో భారీ విధ్వంసం జరిగి యుద్ధనౌక సముద్రంలో మునిగిపోయింది.