భారత్ పాక్ యుద్ధం : దేశంలో ఆహార ధాన్యాల కొరత ఏర్పడిందా?

ఠాగూర్

శుక్రవారం, 9 మే 2025 (08:20 IST)
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంటుంది. అదేసమయంలో భారత్‌లో ఆహార ధాన్యాల కొరత ఏర్పడిందంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిపై కేంద్ర ఆహార శాఖామంత్రి ప్రహ్లాద్ జోషి క్లారిటీ ఇచ్చారు. దేశఁలో ఆహార ధాన్యాల కొరత ఉందన్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. అందువల్ల ప్రజలెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. దేశంలో అవసరానికి మించి నిల్వలు ఉన్నాయన్నారు. కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేంద్రం  వెల్లడించింది. పంజాబ్‌లోనూ ఇలాంటి వదంతులు వ్యాపిస్తాయని ఆయన తెలిపారు. 
 
దేశంలో ఆహార ధాన్యాల కొరత ఏర్పడిందంటూ వ్యాపిస్తున్న వదంతులు పూర్తిగా నిరాధారమైనవని, ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురై, మార్కెట్లలో అధికంగా కొనుగోళ్లు చేయాల్సిన అవసరం లేదని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఆహార పదార్థాలు, నిత్యావసర వస్తువుల కొరత ఉందంటూ కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే కొందరు ఈ దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని ఆయన అన్నారు.
 
'దేశంలో ఆహార ధాన్యాలు, నిత్యావసర వస్తువులకు ఎలాంటి కొరత లేదు. వాస్తవానికి, అవసరానికి మించి నిల్వలు అందుబాటులో ఉన్నాయి. పంజాబ్‌లోనూ ఇలాంటి తప్పుడు వార్తలు వ్యాప్తి చెందుతున్నట్లు నా దృష్టికి వచ్చింది. ప్రజలు ఇలాంటి వదంతులను నమ్మవద్దు' అని మంత్రి జోషి స్పష్టం చేశారు.
 
దేశవ్యాప్తంగా ఆహార ధాన్యాలు, నిత్యావసరాల నిల్వలపై కేంద్ర ప్రభుత్వం సమీక్ష నిర్వహించిందని, ప్రతిచోటా అవసరానికి మించి గణనీయంగా నిల్వలు ఉన్నట్లు నిర్ధారణ అయిందని ఆయన తెలిపారు. బియ్యం, గోధుమలు, శెనగలు, కందిపప్పు, పెసలు వంటి అన్ని రకాల ధాన్యాలు, పప్పుధాన్యాలు జాతీయ అవసరాలకు మించి అందుబాటులో ఉన్నాయని మంత్రి వివరించారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, వదంతుల ఆధారంగా ఆందోళన చెంది మార్కెట్లకు పరుగులు తీసి అధికంగా ఖర్చు చేయవద్దని ఆయన సూచించారు. పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని, సరఫరాలకు ఎలాంటి ఇబ్బంది లేదని మంత్రి భరోసా ఇచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు