ముందు వరుస కరోనా యోధులన్నారు.. సైలెంట్‌గా తొలగించారు..

బుధవారం, 13 జనవరి 2021 (22:48 IST)
కరోనా యోధులకు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం తేరుకోలేని షాకిచ్చింది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 700 మంది పారిశుద్ధ్య కార్మికులను పని నుంచి తొలగించారు. కరోనా సమయంలో చెత్తాచెదారాన్ని తొలగిస్తుంటే, 'ముందు వరుస యోధులు' (ఫ్రంట్‌లైన్ కరోనా వారియర్స్) అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. దండలు వేసి, చప్పట్లు కొడుతూ నెత్తిన పెట్టుకున్నారు. తీరా కరోనా వైరస్ కాస్త శాంతించిన తర్వాత ఆ కరోనా యోధులను చెప్పాపెట్టకుండా తొలగించారు. సంక్రాంతి పండుగకు రెండు రోజులకు ముందు అంటే జనవరి 11న వారికి తేరుకోలేనని షాకిచ్చింది. 
 
కాగా, పారిశుద్ధ్య కార్మికులను తొలగించడం పట్ల డీఎంకే సీనియర్ నేత, ఎంపీ కనిమొళి మండిపడ్డారు. కరోనా యోధులను దేశమంతా పూజిస్తుంటే.. పళనిస్వామి ప్రభుత్వం మాత్రం 700 మంది ఉద్యోగాలను తీసేసిందంటూ విమర్శించారు. 
 
నిరుద్యోగ సమస్య వేధిస్తున్న ఇలాంటి తరుణంలో ఎలాంటి నోటీసులూ లేకుండా ఉద్యోగాలు పీకేయడం చాలా క్రూరమైన చర్య అని మండిపడ్డారు. కరోనా కాలంలో ప్రజలంతా వాళ్లమీదే ఆధారపడ్డారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. సంక్రాంతి పండుగకు ముందు ప్రభుత్వం వాళ్లకు మంచి కానుకనే ఇచ్చిందని కనిమొళి ఎద్దేవా చేశారు.
 
విధుల్లో ఉన్న సమయంలో తమకు కరోనా సోకినప్పటికీ ప్రభుత్వం ఆదుకోలేదని వాపోయారు. కనీసం ఇస్తామన్న పరిహారం కూడా ఇవ్వలేదని వాళ్లంతా ఆరోపించారు. ఉన్నట్టుండి తమను ఉద్యోగం నుంచి తీసేస్తే ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
ఇలా ఆమె ఒక్కతే కాదు.. దాదాపు ఉద్యోగం కోల్పోయిన వాళ్లందరివీ అవే బాధలు. ప్రతాప్ అనే మరో ఒప్పంద కార్మికుడికీ గత ఏడాది మార్చిలో వైరస్ సోకింది. దాని బారి నుంచి వెంటనే బయటపడి.. ఉద్యోగంలో చేరాడు. కానీ, ప్రభుత్వం నుంచి మాత్రం పరిహారం అందలేదు. కేవలం శాశ్వత ఉద్యోగులకే పరిహారం ఇస్తామంటూ అధికారులు చెప్పారని అతడు ఆవేదన చెందాడు. 
 
ఎన్ని కష్టానష్టాలున్నా పనిచేస్తున్నామని, ఇప్పుడు హఠాత్తుగా 700 మందిని ఉద్యోగం నుంచి తొలగించారని చెప్పాడు. పది పన్నెండేళ్లుగా రాత్రింబవళ్లన్న తేడా లేకుండా పనిచేస్తున్నామని, వార్ధా, నివర్ తుఫాన్లప్పుడు, కరోనా సమయంలోనూ రెండ్రెండు షిఫ్టుల్లో పనిచేశామన్నాడు. ఉద్యోగం కోల్పోయిన వారిని ఎవరిని కదిలించినా ఇదే గోడు వినిపిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు