ఓవైపు ఊరిస్తోన్న అధికార పీఠం.. మరోవైపు జైలు ఊచలు.. అన్నాడీఎంకె ప్రధాన కార్యదర్శి శశికళ ఆలోచనలు సోమవారం రాత్రి నుంచి వీటి చుట్టే తిరిగాయి. అక్రమాస్తుల కేసులో నేటి ఉదయం తీర్పు వెలువరించిన సుప్రీం.. శశికళను దోషిగా ప్రకటించడంతో ప్రస్తుతం ఆమె ముందు గాఢాంధకారం అలుముకున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో సోమవారం రాత్రంతా చిన్నమ్మ కంట నిద్ర లేదు.
కోర్టు తీర్పు అనుకూలంగా వస్తుందా? ప్రతికూలంగా వస్తుందా? అన్న ఆందోళన, ఒకలాంటి బెంగ ఆమెలో కనిపించినట్టు ఆమె తరపు వర్గాలు తెలిపాయి. సుప్రీం తీర్పు సానుకూలంగా వచ్చేలా పలువురు దేవతలను శశికళ వేడుకున్నట్టుగా చెబుతున్నారు. అలాగే ఒకవేళ తాను గనుక జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తితే పగ్గాలు మాత్రం పన్నీర్ చేతుల్లోకి వెళ్లకుండా ఉండేందుకు కూడా ఆమె రాత్రంతా వ్యూహాలు రచించినట్టు సమాచారం.