పళని జైలుకు రావొద్దు.. పరిపాలన సంగతేంటో చూడు.. శశికళ కబురు

గురువారం, 23 ఫిబ్రవరి 2017 (10:02 IST)
దివంగత సీఎం జయలలిత అక్రమాస్తుల కేసులో ఏ2 నిందితురాలిగా జైలు శిక్ష అనుభవిస్తున్న వీకే శశికళ.. జైలుకు వచ్చే నేతలను కలిసేందుకు ఇష్టపడట్లేదట. జయ మరణించిన తర్వాత ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శిగా పార్టీ పగ్గాలు చేపట్టిన శశికళ... తాను జైలుకెళ్లాల్సి రావడంతో పళనిస్వామికి సీఎం పదవి కట్టబెట్టారు.

అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నెగ్గిన సందర్భంగా పళనిస్వామి, ఆయన మంత్రివర్గ సహచరులతో కలిసి శశికళ ఆశీర్వాదం తీసుకునేందుకు సోమవారం బెంగళూరు పరప్పన అగ్రహారం జైలుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కానీ తనను కలిసేందుకు ఎవ్వరూ జైలుకు రావొద్దని.. పరిపాలనపై వారు దృష్టి పెట్టాలని సూచించినట్లు తెలుస్తోంది. 
 
తనను కలిసేందుకు జైలుకు వచ్చిన ఆమె అక్క కుమారుడు, పార్టీ డిప్యూటీ కార్యదర్శి దినకరన్‌తో తనను జైలులో వచ్చి కలవొద్దని కబురు పంపారు. దీంతో పళని తన ప్రయాణాన్ని రద్దు చేసుకున్నట్టు చెప్తున్నారు. అయినప్పటికీ కనీసం కృతజ్ఞతలు చెప్పేందుకయినా ఆమెను కలిసేందుకు అవకాశం ఇవ్వాలంటూ మంత్రులు లేఖ రాసినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.

వెబ్దునియా పై చదవండి