పళనిస్వామి ఔట్! తదుపరి ముఖ్యమంత్రిగా దినకరన్? : అన్నాడీఎంకే ఎమ్మెల్యే తంగదురై

బుధవారం, 22 ఫిబ్రవరి 2017 (09:17 IST)
తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా టీటీవీ దినకరన్ నియమితులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం సీఎంగా ఉన్న ఎడప్పాడి కె. పళనిస్వామితో రాజీనామా చేయించి ఆయన స్థానంలో దినకరన్‌ను సీఎంగా చేయాలన్న తలంపులో ఆ పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ ఉన్నట్టు తెలుస్తోంది 
 
దిండుగల్‌ జిల్లా నెలకోట్టై ఎమ్మెల్యే తంగదురై 5వ తేదీ నుంచి నియోజకవర్గంలో కనిపించలేదు. ఈపరిస్థితుల్లో మంగళవారం గట్టి పోలీసు భద్రత నడుమ స్థానిక ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, నియోజకవర్గ ప్రజలు, పార్టీ నిర్వాహకుల అభిప్రాయాలను తీసుకున్న తర్వాతే ముఖ్యమంత్రిగా ఎడప్పాడి పళనిస్వామికి మద్దతు తెలిపానన్నారు.
 
ముఖ్యమంత్రిగా పళనిస్వామి ఎంపిక తర్వాత నియోజకవర్గంలో పర్యటించేందుకు వచ్చానన్నారు. అయితే తాను పోలీసుల భదత్ర కోరలేదన్నారు. మాజీ ముఖ్యమంత్రి జయలలిత హయాంలోనే దినకరన్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉండేవారని, ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే తరుణం త్వరలోనే వస్తుందని తంగదురై తెలిపారు. దీంతో ముఖ్యమంత్రిగా ఎడపాడి పళనిస్వామి పదవిని కోల్పోయే అవకాశమున్నట్లు పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. 

వెబ్దునియా పై చదవండి