అమ్మ చనిపోలేదు.. చంపేశారు.. నిగ్గు తేల్చండి : సుప్రీంకోర్టులో 'శశికళ' పిటీషన్

మంగళవారం, 20 డిశెంబరు 2016 (12:01 IST)
తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి దివగంత జయలలిత చనిపోలేని, చంపేశారని ఆ పార్టీ బహిష్కృత రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప ఆరోపిస్తున్నారు. ఇదే అంశంపై ఆమె సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించారు. జయలలిత మరణం వెనుక అనేక అనుమానాలు ఉన్నాయని వాటిని నిగ్గు తేల్చేందుకు సీబీఐతో విచారణ జరిపించాలంటూ పిటీషన్‌లో ఆమె పేర్కొన్నారు. 
 
జయలలిత మరణం తర్వాత తమిళనాట రాజకీయాలు మంచి రసకందాయంలో పడిన విషయం తెల్సిందే. ఆపత్కాల ముఖ్యమంత్రిగా ఓ.పన్నీర్ సెల్వం సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఇపుడు ఆయనను దించేసి జయలలిత స్నేహితురాలు శశికళ ముఖ్యమంత్రిగా కూర్చోవాలని భావిస్తున్నారు. ఈ కుర్చీకోసం ఎత్తులు, చిత్తులు, బెదిరింపులు, దేబిరింపులు ఇలా సామదానదండోపాయాలను ప్రయోగిస్తున్నారు. 
 
అయితే, శశికళ పుష్ప మాత్రం మరోలా స్పందిస్తున్నారు. జయలలిత మృతిపై ఎన్నో అనుమానాలున్నాయనీ, జయది సహజ మరణం కానేకాదంటూ ఆమె మృతిపై నిజానిజాలు నిగ్గు తేల్చాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన శశికళ, జయలలితది సహజ మరణమే అయితే.. ఇన్నిరోజులు ఎందుకుపట్టింది? ఆసుపత్రిలోకి ఎవరినీ ఎందుకు అనుమతించ లేదు? జయ మరణించకముందే ఎమ్మెల్యేలంతా సమావేశం కావాల్సిన అవసరం ఏమిటి? అని ఆమె ప్రశ్నిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి