తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఉవ్విళ్లూరిన జయలలిత స్నేహితురాలు శశికళ ఇపుడు బెంగుళూరులోని పరప్పణ అగ్రహార జైలులో ఊచలు లెక్కిస్తున్నారు. జయ అక్రమాస్తుల కేసులో ఆమెకు నాలుగేళ్ళ జైలుశిక్షను సుప్రీంకోర్టు ఖరారు చేసిన విషయం తెల్సిందే. దీంతో బుధవారం కోర్టులో లొంగిపోగా, ఆ తర్వాత జైలుకు తరలించారు.
సాధారణ ఖైదీలు మాదిరిగానే ఇద్దరు.. ముగ్గురు ఖైదీలు ఉండే సెల్‌లోనే శశికళను ఉంచనున్నారు. జైలు నిబంధనల ప్రకారం... ఉదయం 6.30 గంటలకు అల్పాహారం, 11.30 గంటలకు భోజనం, సాయంత్రం 4 గంటలకు టీ, రాత్రి 7 గంటలకు భోజనం అందిస్తారు. శశికళ ప్రత్యేక దుస్తులు ధరించేందుకు జైలు అధికారులు నిరాకరించారు. దీంతో ఆమె జైలు దుస్తులనే ధరించారు.
జైల్లో శశికళకు ఏసీ రూమ్, వేడినీళ్లు, ఇంటి భోజనం, సహాయకురాలిని ఏర్పాటు చేసుకునేందుకు అనుమతివ్వాలని అమె తరపు న్యాయవాది చేసిన విజ్ఞప్తిని న్యాయస్థానం తోసిపుచ్చింది. శశికళ గతంలో ఈ కేసుకు సంబంధించి ఆరు నెలలు ఇదే జైల్లో ఉన్నారు. అపుడు జయలలిత వెంట ఉండటంతో ఆమెకు వీఐపీ సౌకర్యాలు లభించాయి. కానీ, ఇపుడు సాధారణ ఖైదీ కావడంతో ఇవేమీ దక్కలేదు.