హిజాబ్ వ్యవహారంపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో కర్నాటకలో మూతపడిన విద్యాసంస్థలు సోమవారం నుంచి తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే అత్యధిక ముస్లిం విద్యార్థులు హిజాబ్ ధరించకుండా తరగతులకు హాజరైనప్పటికీ, శివమొగ్గ జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 13 మంది విద్యార్థులు పదవ ప్రిపరేటరీ పరీక్షకు హిజాబ్ తొలగించి.. హాజరు కావడానికి నిరాకరించారు. పరీక్షలను బహిష్కరిస్తున్నామని పేర్కొన్నారు.
హిజాబ్ లేకుండా ప్రత్యేక గదిలో పరీక్షలు రాయమని టీచర్లు, స్కూల్ యాజమాన్యం వారిని ఒప్పించే ప్రయత్నం చేసింది. అయితే, విద్యార్థులు ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. పరీక్షలను బహిష్కరించాలని నిర్ణయించుకున్నారు. అక్కడి పాఠశాలకు చేరుకున్న బాలికల తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు అండగా ఉండి హిజాబ్ లేకుండా తరగతులకు హాజరుకాలేమని చెప్పి ఇంటికి తీసుకెళ్లారు.