భాజపాకి వెన్నుదన్నుగా నిలుస్తూ... ఇంకా చెప్పాలంటే సదరు పార్టీకి అనుబంధ సంస్థగా ఉండే ఆర్ఎస్ఎస్(రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్) కార్యాలయానికి సెక్యూరిటీ తగ్గిస్తే... మొదటి రియాక్షన్ భాజపా నేతల నుండి వస్తుందని చాలా మంది భావిస్తూంటారు. భాజపా, ఆర్ఎస్ఎస్‌ల మధ్య ఉండే సంబంధాల గురించి తెలిసిన ఎవరైనా... ఈ విధంగానే ఆలోచిస్తారు. అయితే... మధ్యప్రదేశ్‌లో మాత్రం సీన్ రివర్స్ కావడం విశేషం.
వివరాలలోకి వెళ్తే... మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి సెక్యూరిటీ తగ్గించారనే విషయం తెలుసుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత, భోపాల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి దిగ్విజయ్ సింగ్... వెంటనే స్పందించి భద్రతను మళ్లీ పునరుద్ధరించాలంటూ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ను ట్విట్టర్ ద్వారా కోరారు.
అయితే.. ఈ వ్యవహారంపై స్పందించిన భాజపా, ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి సెక్యూరిటీ తగ్గిస్తే దిగ్విజయ్ సింగ్‌కు అంత ఉలికిపాటు ఎందుకంటూ ప్రశ్నించింది. 30 ఏళ్లుగా భాజపాకి కంచుకోటగా ఉంటున్న భోపాల్ నుండి మరోసారి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న దిగ్విజయ్ సింగ్... ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి సెక్యూరిటీ తగ్గింపు అంశం భాజపాకి రాజకీయంగా కలిసొస్తుందనే భావనతోనే వెంటనే స్పందించారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ... ఆర్ఎస్ఎస్‌ను విమర్శించే కాంగ్రెస్ నేతల్లో ముందు వరుసలో ఉండే దిగ్విజయ్ సింగ్... ఆ సంస్థ కార్యాలయానికి సెక్యూరిటీని పునరుద్ధరించాలని కోరడం నిజంగా విశేషమనే చెప్పుకోవాలి.