ప్రేమించి మోసం చేసే కేసుల్లో సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి సహజీవనం చేసి మోసం చేయడం అనేది అత్యాచారం కిందకే వస్తుందని, అలాంటి వారిని శిక్షించాల్సిందేనని స్పష్టం చేసింది.
ఈ వివరాలను పరిశీలిస్తే, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన ఓ యువతిని అదే రాష్ట్రానికి చెందిన అనురాగ్ సోనీ అనే యువకుడు ప్రేమించాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని నమ్మించి దగ్గరయ్యాడు. వీరిద్దరూ కొన్ని నెలల పాటు సహజీవనం చేశారు. పెళ్లి చేసుకోమని ఒత్తిడి తేవడంతో ముఖం చాటేశాడు. దీంతో బాధిత యువతి కోర్టును ఆశ్రయించింది. కింది కోర్టు విచారణ జరిపి ప్రేమ పేరుతో మోసం చేసినందుకు పదేళ్ల జైలు శిక్ష వేసింది. దీన్ని హైకోర్టులో నిందితుడు సవాల్ చేశాడు. అక్కడా చుక్కెదురు కావడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.
ఈ పిటిషన్‌పై న్యాయమూర్తులు జస్టిస్ ఎల్ నాగేశ్వర రావు, జస్టిస్ ఎమ్‌ఆర్ షాలతో కూడిన ధర్మాసనం కేసును విచారించింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు కాబట్టి, శారీరక కలయికకు ఆమె సమ్మతిని సాధారణ అనుమతిగా పరిగణించలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. లైంగికంగా కలిసేందుకు ఆమె అంగీకరించినా అది అత్యాచారమేనని, హత్య కన్నా రేప్ అత్యంత దారుణమైనదని చివాట్లు పెట్టింది, నిందితుడికి ఏడేళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది.