కేంద్ర పౌరవిమానయానశాఖా మంత్రి అశోకగజపతి రాజుపై దాడికి శివసేన ఎంపీలు యత్నించారు. లోక్‌సభ సాక్షిగా గురువారం ఈ సంఘటన జరిగింది. శివసేన పార్టీకి చెందిన ఎంపీలతో కలిసి కేంద్ర మంత్రి అనంత గీతె... అశోకగజపతి రాజుపై చేయి చేసుకోబోయారు. ఆ సమయంలో అక్కడే ఉన్న కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, అహ్లువాలియాలు ఈ దాడిని అడ్డుకున్నారు. దీంతో సభలో ఒక్కసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
శివసేనకు చెందిన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ ఎయిరిండియా సిబ్బందిపై దాడి చేయగా, ఆయనపై విమానాల్లో ప్రయాణించకుండా నిషేధం విధించింది. ఈ వ్యవహారం లోక్‌సభలో గురువారం చర్చకు వచ్చింది. ఇదే అంశంపై ఈ రోజు విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు మాట్లాడుతూ ప్రయాణికుల భద్రత అంశంలో రాజీ పడే ప్రసక్తేలేదని తేల్చి చెప్పారు. గైక్వాడ్- ఎయిర్ ఇండియా వివాదంలో విచారణ కొనసాగుతోందని అన్నారు. అనంతరం స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను వాయిదా వేశారు.
అయితే, ఆ వెంటనే లోక్‌సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. అశోక్ గజపతిరాజుపై శివసేన ఎంపీలు దురుసుగా ప్రవర్తించారు. ఆయనను చుట్టుముట్టి పలు వాదనలు వినిపించారు. శివసేన ఎంపీల దురుసు ప్రవర్తనపై ఎన్డీఏ సభ్యులు కూడా ప్రతిస్పందించారు. శివసేన ఎంపీలతో కలిసి కేంద్ర మంత్రి అనంత్ గీతె మంత్రి గజపతిరాజుపై చేయి చేసుకునేందుకు ప్రయత్నించారు. అయితే, అనంత్ గీతెను స్మృతి ఇరానీ, అహ్లూవాలియా బలవంతంగా పక్కకు తీసుకెళ్లారు. ఇదేసమయంలో అశోక్ గజపతి రాజుకు మద్దుతుగా టీడీపీ ఎంపీలు వెళ్లారు. వివాదం ముదరకుండా అశోక్ గజపతి రాజు వద్దకు వెళ్లిన రాజ్‌నాథ్ సింగ్ ఆయనను బయటకు తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా మీడియాపై కూడా శివసేన ఎంపీలు దురుసుగా ప్రశ్నించారు. లోక్‌సభ ప్రారంభం కాకముందు ఆ ప్రాంగణంలో శివసేన ఎంపీలు మీడియాతో మాట్లాడుతూ ఆయనను కాపాడే ప్రయత్నం చేశారు. అసలు గైక్వాడ్ దాడి చేశారని ఎవరు చెప్పారని ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. గైక్వాడ్ మీడియాతో ఎందుకు మాట్లాడట్లేదని ఓ విలేకరి అడగగా.. తమకు మీడియా నుంచి దూరంగా పారిపోయే అవసరం లేదని అన్నారు. గైక్వాడ్ పార్లమెంట్ సభ్యుడని, లోక్‌సభలో మాట్లాడతారని చెప్పారు.