ఓ పెళ్లి వాట్సాప్ కారణంగా ఆగిపోయిందంటే నమ్ముతారా? కానీ ఇది నిజం. పెళ్లి మరికొన్ని గంటల్లో జరుగనుందనగా వరుడి తల్లిదండ్రులు వధువు తల్లిదండ్రులకు ఫోన్లో మీ అమ్మాయి విపరీతంగా వాట్సాప్ యూజ్ చేస్తోంది... ఇలాంటి అమ్మాయి పెళ్లయ్యాక ఇక ఏం చేస్తుందీ అంటూ తమ అబ్బాయికి ఆమెను ఇచ్చి పెళ్లి చేయలేమని తేల్చి చెప్పారు. దీనితో పెళ్లి ఆగిపోయింది.
దీనికి సంబంధించి పూర్తి వివరాలను చూస్తే... ఉత్తర్‌ప్రదేశ్‌లో అమ్రోహ జిల్లాకు చెందిన ఖమర్ హైదర్ కుమారుడితో నౌగాన్ సాదత్ ప్రాంతానికి చెందిన వధువుకు పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయించారు. పెళ్లి సెప్టెంబరు 5న చేయాలని నిశ్చయించారు. పెళ్లి మరికొన్ని గంటల్లో జరుగుతుందనగా పెళ్లి ఏర్పాట్లపై వధువు తల్లిదండ్రులు వరుడి తల్లిదండ్రులకు ఫోన్ చేశారు. ఫోన్లో వాళ్లు చెప్పిన మాటలు విని వీరు షాకయ్యారు.
మీ అమ్మాయిని మా అబ్బాయికి పెళ్లి చేసుకునేందుకు మాకు ఎంతమాత్రం ఇష్టం లేదనీ, వధువు ఎక్కువగా వాట్సాప్‌ను వినియోగించడం చూసి షాక్ తిన్నామనీ, అలాంటి అమ్మాయి మా ఇంటికి వచ్చాక ఏం చేస్తుందంటూ ప్రశ్నించారు. అందువల్ల తమకు ఈ పెళ్లి ఇష్టం లేదని అన్నారు. ఐతే వధువు తల్లిదండ్రులు మాత్రం మరోలా చెపుతున్నారు. వరుడి కుటుంబం అదనపు కట్నం అడిగిందనీ, తమకు రూ. 65 లక్షలు ఇస్తే ఒప్పుకుంటామని చెప్పారనీ, అందుకు తాము అంగీకరించనందువల్లనే ఇలా వాట్సాప్ అంటూ కొత్త మెలిక పెట్టారని ఆరోపించారు. ఈ విషయాన్ని పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు.