ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ కారణంగా అయ్యప్ప క్షేత్రానికి వెళ్లే భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వర్షాలకు తోడు వాతావరణ ప్రభావంతో కొండకు వెళ్లే మార్గం, సన్నిధానం ప్రాంతాల్లో అనేక పాములు సంచారం చేస్తున్నాయి. బుధవారం పాము కరిచిన చిన్నారి ఒకరు ప్రాణాలు కూడా కోల్పోయింది.
మరోవైపు, ఆలయానికి వెళ్లే దారిలో వన్యప్రాణుల దాడులు జరగకుండా అటవీశాఖ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఆ శాఖలో ఇద్దరు పాములు పట్టేవారు పనిచేస్తున్నారు. అయితే ఘటన తీవ్రత దృష్ట్యా మరో ఇద్దరు పాములు పట్టేవారిని నియమించాలని ఫారెస్ట్ రేంజ్ అధికారి ఆదేశించారు. వర్షాలు, వాతావరణంలో మార్పుల సమయంలో యాత్రికులు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ సూచించింది. శబరిమల ఆలయ పరిసరాల్లో యాత్రికులకు అత్యవసర వైద్య సహాయం అందించేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలు ఉన్నాయని అధికారులు తెలిపారు.