ఇలాంటి వారిని ఆదుకునేందుకు కష్టకాలంలో ముందుకు వచ్చిన వెండితెర విలన్, రియల్ హీరో సోను సూద్. ఈయన నిజ జీవితంలో ఎంతో మంది అపన్నులకు ఆపద్బాంధవుడిగా నిలిచారు. కరోనా లాక్డౌన్ సమయంలో ప్రభుత్వాలు కూడా చేయలేని పనులను ఆయన చేశారు. వలస కార్మికులను వారి ఊళ్లకు పంపించేందుకు ఏర్పాట్లు చేశారు.
కోట్లాది రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటూ, స్టార్ హీరోలుగా వెలిగిపోయేవారు కూడా చేయలేని పనులను సోను చేశారు. ఈ నేపథ్యంలో, సోనూకు దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఏర్పడ్డారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. తెలియని విషయం ఏమిటంటే... ప్రజలకు సాయం చేయడం కోసం సోను తన ఆస్తులను కూడా తాకట్టు పెట్టారు.
రూ.10 కోట్లను పోగు చేయడం కోసం ముంబైలో తనకు గల ఎనిమిది ఆస్తులను ఆయన తాకట్టు పెట్టారు. ఇందులో ఆరు ఫ్లాట్లు, రెండు దుకాణాలు ఉన్నాయి. ఈ సందర్భంగా వెస్ట్ ఇండియా రెసిడెన్సియల్ సర్వీసెస్ సీనియర్ డైరెక్టర్, హెడ్ రితేశ్ మెహతా మాట్లాడుతూ, ఎదుటి వారి కోసం ఇంత గొప్ప పని చేసిన వారిని తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని తెలిపారు.