నైరుతి రుతుపవనాలు నిష్క్రమించారు. దేశంలో వ్యవసాయ రంగానికి ఊతమిచ్చే ఈ రుతుపవనాలు ఆదివారంతో పూర్తిగా విడిచి వెళ్లినట్టు తేలింది. బంగాళాఖాతంలో సెప్టెంబరు చివరి వారం నుంచి అక్టోబరు మొదటి వారం వరకు ఉపరితల ఆవర్తనాలు, అల్పపీడానాలు ఏర్పడటంతో నైరుతి రుతుపవనాల నిష్క్రమణలో కాస్త జాప్యం జరిగింది.
నిజానికి ఈ నెల 17వ తేదీన రాజస్థాన్ రాష్ట్రంలోని వాయువ్య ప్రాంతం నుంచి వైదొలగాల్సిఉన్నప్పటికీ ఈ యేడాది మూడు రోజులు ఆలస్యంగా సెప్టెంబరు 20వ తేదీన నిష్క్రమించాయని ఆదివారం భారత వాతావరణ శాఖ తెలిపింది. దేశం నుంచి నైరుతి రుతుపవనాలు నిష్క్రమించిన రోజునే దక్షిణ భారతదేశంలో తమిళనాడు, రాయలసీమ, కోస్తా, కేరళ, కర్నాటకలో ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించాలి.
కాగా, జూన్ ఒకటి నుంచి సెప్టెంబరు 30వ తేదీ వరకు నాలుగు నెలల సీజన్‌లో తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో మినహా మిగిలిన ప్రాంతాల్లో సాధారణం కంటే ఆరు శాతం ఎక్కువ వర్షపాతం నమదైంది. మొత్తం 87 సెంటీమీటర్లకు గాను 92.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.