కరోనాను ఎదుర్కొనేలా రైళ్లలో ప్రత్యేక ఏర్పాట్లు.. కోచ్‌ల్లో టైటానియం డయాక్సైడ్‌ కోటింగ్

గురువారం, 16 జులై 2020 (06:22 IST)
కరోనా వైరస్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో దానిని ఎదుర్కొనేందుకు అనువుగా రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. వైరస్‌ను నిర్వీర్యం చేసేందుకు రైల్వే కోచ్‌ల్లో టైటానియం డయాక్సైడ్‌ కోటింగ్‌, ప్లాస్మా ఎయిర్‌ ప్యూరిఫికేషన్, శానిటైజేషన్‌కు పకడ్బందీగా ఏర్పాట్లు చేయడం వంటి ప్రణాళికలపై కార్యాచరణకు పూనుకుంది.

కరోనా వైరస్‌ విస్తృత వ్యాప్తి నేపథ్యంలో ప్రయాణీకుల రైళ్లను ఆగస్ట్‌ 12 వరకూ నిలిపివేసిన సంగతి తెలిసిందే. ప్రయాణీకుల రైళ్లు పట్టాలెక్కేలోగా ఈ చర్యలను చేపట్టాలని భావిస్తోంది. కపుర‍్తలాలోని రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ యూనిట్‌లో ఈ తరహా తొలి నమూనా రైలును రూపొందించారు.

రైల్వే కోచ్‌లన్నింటిలో ఈ సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావాలని రైల్వేలు యోచిస్తున్నాయి. ఎక్కడా చేతులు ఉపయోగించకుండా కాళ్లతోనే అన్నింటినీ ఆపరేట్‌ చేసేలా చర్యలు చేపడతామని రైల్వేలు తెలిపారు. కోచ్‌ల్లో కాపర్‌తో చేసిన హాండ్‌రెయిల్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తారు.

కాపర్‌పై వైరస్‌ చేరిన కొద్దిసేపటికే వైరస్‌లోని డీఎన్‌ఏ, ఆర్‌ఎన్‌ఏలను ధ్వంసం చేస్తుందని రైల్వే మంత్రిత్వ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ప్లాస్మా ఎయిర్‌ పరికరాలు ఏసీ కోచ్‌లో గాలిని, ఉపరితలాలను స్టెరిలైజ్‌ చేస్తాయని తెలిపాయి.

నూతన కోచ్‌లను ఈ తరహాలోనే తయారు చేసేందుకు రైల్వేలు సంసిద్ధమయ్యాయి. భవిష్యత్‌లో కోచ్‌ల తయారీలో వీటిని పొందుపరుస్తామని రైల్వే వర్గాలు వెల్లడించాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు