రజనీకాంత్‌కు భాజపా ఝలక్... లాభాల కోసం చూసే రజినీకి పరాభవం తప్పదంటూ..

మంగళవారం, 16 మే 2017 (12:16 IST)
దేశ ప్రధాని నరేంద్రమోడీతో తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు ఉన్న సత్సంబంధాల గురించి అందరికీ తెలిసిన విషయమే. తమిళనాడులో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసే ప్రయత్నాల్లో భాగంగా రజనీతో మోడీ చర్చలు జరుపుతున్నారని వదంతుల నేపథ్యంలో తన అభిమానులతో రజనీ ఆత్మీయ కలయికను ఏర్పాటు చేసారు. పేరుకు అభిమానులతో ఫోటో షూట్ అయినా, తన రాజకీయ ప్రవేశంపై ఓ చర్చా వేదికగా, అభిమానుల అభిప్రాయాలను తెలుసుకునేందుకే దీన్ని ఏర్పాటు చేసారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
 
అయితే ఇప్పుడు మన్నార్‌గుడి మాఫియాగా పేరుపొందిన శశికళ అండ్-కో జైల్లో ఊచలు లెక్కపెట్టేందుకు కారణమైన బిజెపి నేత, మిస్టర్ ఫైర్‌బ్రాండ్ సుబ్రహ్మణ్యస్వామి రజనీకాంత్‌పై అప్పుడే విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టేసారు. రాజకీయ నిబద్ధత లేదంటూ, అసలు ప్రజల సమస్యలను ఎప్పుడు పట్టించుకోలేదంటూ, తన సినిమాలు, దాంతో వచ్చే లాభాలే తప్ప మరో ధ్యాస లేని రజనీకి రాజకీయాల్లో పరాభవం తప్పదని వ్యాఖ్యానిస్తున్నారు. ఇటీవల నటిస్తున్న సినిమాలన్నీ వరుసబెట్టి పరాజయాలు పొందుతున్న తరుణంలో ఇక సిల్వర్‌స్క్రీన్‌కు టాటా చెప్పేసి, రాజకీయ తీర్థం పుచ్చుకోవాలనుకుంటున్నారని అన్నారు.
 
సినిమా గ్లామరే పెట్టుబడిగా, అభిమానగణం, చుట్టూ ఉన్న భజనపరుల ప్రోత్సాహంతో గతంలోనూ ఎందరో నటులు ఏదో సాధిద్దామని రాజకీయాల్లోకి స్వంత పార్టీలు, మానిఫెస్టోలు, అజెండాల పేరుతో వచ్చినా ఎంతోకాలం నిలదొక్కుకోలేకపోవడం, అధికారాన్ని పొందలేకపోవడం చూస్తూనే ఉన్నాము. ఆంధ్రప్రదేశ్‌లో చిరంజీవి, తమిళనాడులో విజయకాంత్ తదితరులు దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు తమిళనాడులో రజనీకాంత్, కమల్‌లు రాజకీయప్రవేశానికి ఉవ్విళ్లూరుతున్నా, భవిష్యత్తు ఎలా ఉండబోతుందోననే ఆందోళనతో ధైర్యం చేయలేకపోతున్నారని కోలీవుడ్ సర్కిళ్లలో జరుగుతున్న చర్చ.

వెబ్దునియా పై చదవండి