అయోధ్య గర్భగుడిలోకి సూర్య కిరణాలు.. ఎలా సాధ్యం?

వరుణ్

ఆదివారం, 21 జనవరి 2024 (12:56 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యలో నిర్మించిన భవ్య మందిరంలో సోమవారం శ్రీరామచంద్రుడు సతీసమేతంగా కొలువుదీరనున్నారు. ఈ అమృత ఘడియల కోసం యావత్ దేశం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తుంది. కోట్లాది హిందువుల కల సాకారమవుతున్న వేళ అయోధ్య మందిరంలో ఏర్పాటు చేస్తున్న 'సూర్య తిలకం' విశిష్టతలు తెలుసుకుందాం. సాంకేతికత, సంప్రదాయాల సమాహారమైన ఈ ప్రత్యేక ఏర్పాటును ఎలా రూపొందించారో చూద్దాం..!
 
రామాలయ నిర్మాణంలో భాగంగా ఏటా శ్రీరామనవమి రోజున మధ్యాహ్నం 12 గంటలకు మొదలై ఆరు నిమిషాల పాటు సూర్యకిరణాలు గర్భగుడిలోని శ్రీరాముడి విగ్రహ నుదుటిపై ప్రసరించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీన్నే రాముడికి సూర్య తిలకంగా వ్యవహరిస్తున్నారు. దీని కోసం సీఎస్‌ఐఆర్‌ ఆధ్వర్యంలో ఉన్న సెంట్రల్‌ బిల్డింగ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ప్రత్యేక వ్యవస్థను రూపొందించింది. అందుకోసం ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆస్ట్రోఫిజిక్స్‌ సాయం తీసుకుంది. దీనికి కావాల్సిన వస్తువులను బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఆప్టిక్స్‌ సంస్థ తయారు చేసింది.
 
ఏటా రామనవమి మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలు రాముడి నుదిటిపై ప్రసరించేలా ప్రత్యేకంగా కటకాలు, అద్దాలు, గేర్‌బాక్స్‌లు, గొట్టాలు రూపొందించారు. మూడో అంతస్తు నుంచి సూర్యకిరణాలు గర్భగుడిలోని విగ్రహం వరకు ప్రసరించేలా వీటిని అమర్చారు. చంద్రమాన కేలండర్ ప్రకారం ఏటా శ్రీరామనవమిని నిర్ణయిస్తారు. కానీ, సూర్యుడి సంచారం మాత్రం అందుకుభిన్నంగా ఉంటుంది. అంటే ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజు ఒకే రకంగా సూర్యకిరణాలు ప్రసరించవు. దీని మూలంగా విగ్రహ నుదిటిపై సూర్యతిలక స్థానం మారడమనేది ఈ వ్యవస్థ రూపకల్పనలో సమస్యగా మారింది.
 
దీనికి ఐఐఏ వినూత్న పరిష్కారంతో ముందుకొచ్చింది. సూర్య, చంద్రరాశుల తిథులు 19 ఏళ్లకు ఒకసారి కలుస్తాయి. దీన్ని ఆధారం చేసుకొని రామనవమి రోజు సూర్యుడి గమనంలో వచ్చే మార్పునకు అనుగుణంగా కటకాలు, అద్దాలను గేర్‌బాక్స్‌ల సాయంతో అమరుస్తారు. అందుకోసం 19 గేర్‌బాక్స్‌లను రూపొందించారు. తద్వారా చంద్రమాన తిథికి అనుగుణంగా సూర్య కిరణాలు ఏటా రామనవమి నాడు సరిగ్గా రాముడి నుదుటిపై ఒకే స్థానంలో ప్రసరించేలా చేస్తారు. ఈ సూర్యతిలకం కోసం ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక వ్యవస్థలోనూ ఎలాంటి ఉక్కు, ఇనుము, బ్యాటరీలు, విద్యుత్తు వాడలేదని సీబీఆర్‌ఐ తెలిపింది. సూర్యకిరణాలు మూడో అంతస్తుపై ఉండే శిఖరం నుంచి రావాల్సి ఉన్నందున ఆలయ నిర్మాణం మొత్తం పూర్తయిన తర్వాతే దీన్ని ఆవిష్కరించడం సాధ్యమవుతుందని అధికారులు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు