అయోధ్య భూవివాదం కేసు: 8వ తేదీకి వాయిదా.. ఓవైసీ ఫైర్

బుధవారం, 6 డిశెంబరు 2017 (10:49 IST)
అయోధ్య భూవివాదంపై కేసును దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఫిబ్రవరి ఎనిమిదో తేదీకి వాయిదా వేసింది. మంగళవారం కేసుపై సుప్రీం కోర్టులో వాదనలు జరిగిన నేపథ్యంలో కేసుకు సంబంధించిన అన్ని పత్రాలు తమకు చేరలేదని సున్నీ బోర్డు తరపున వాదనలు వినిపించిన కపిల్ సిబాల్ అన్నారు. దీంతో కేసు విచారణను 2019 సాధారణ ఎన్నికల అనంతరం చేపట్టాలని కోరారు. లేనిపక్షంలో ఎన్నికల ఫలితాలపై తీర్పు ప్రభావం పడే అవకాశం ఉంటుందని చెప్పారు. 
 
అయితే సిబాల్ వాదనలు విన్న కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని ముగ్గురు జడ్జిల బెంచ్ సాధారణ ఎన్నికల వరకు తీర్పును వాయిదా వేయాలవే సిబాల్ విన్నపాన్ని తోసిపుచ్చింది. ఈ కేసులో తీర్పును ఫిబ్రవరి 8, 2018కి వాయిదా వేస్తున్నట్లు ముగ్గురు జడ్జిల ధర్మాసనం పేర్కొంది.
 
మరోవైపు బీజేపీ, వీహెచ్పీ, ఆర్ఎస్ఎస్ రామ మందిరం సమస్యను అడ్డుపెట్టుకుని పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాయని ఎంఐఎమ్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. 2019లో నరేంద్ర మోడీ సర్కారును రక్షించాలనే లక్ష్యంతో రామ మందిర సమస్యను అడ్డుపెట్టుకోవాలని సంఘ్ పరివార్ ప్రయత్నిస్తోందని తెలిపారు. సున్నీ వక్ఫ్ బోర్డు తరపున సుప్రీం కోర్టులో కపిల్ సిబాల్ వాదనను ఒవైసీ సమర్థించారు.
 
దేశంలో పరిష్కరించాల్సిన సమస్యలు నెలకొన్న తరుణంలో ఎన్నికలు జరగాలి తప్పా, రామ మందిరం నిర్మాణం కాదని విమర్శించారు. 2018 అక్టోబర్లో రామ మందిరం నిర్మాణం పూర్తవుతుందంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలను ఓవైసీ తప్పుబట్టారు. ఇలాంటి వ్యాఖ్యల ద్వారా మోహన్  భగవత్ ముస్లింలను రెచ్చగొట్టి పబ్బం గడుపుతున్నారని మండిపడ్డారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు