ఆర్థిక మందగమనానికి సుప్రీంకోర్టే కారణం : హరీష్ సాల్వే

గురువారం, 19 సెప్టెంబరు 2019 (06:42 IST)
ఆర్థిక మందగమనానికి సుప్రీంకోర్టే ప్రధాన కారణమని ప్రముఖ న్యాయవాది హరీష్ సాల్వే అంటున్నారు. పైగా, దీనికి గల కారణాలను కూడా ఆయన వివరిస్తున్నారు. 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణానికి సంబంధించి 2012లో సుప్రీంకోర్టు ఒక్క కలంపోటుతో 122 స్పెక్ట్రమ్ లైసెన్సులు రద్దు చేసిందనీ, ఈ కారణంగా దేశ టెలికాం పరిశ్రమ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయిందన్నారు. 
 
2జీ కేసుకు సంబంధించి.. భారతీయ భాగస్వాములతోనే ఇక్కడ వ్యాపారం చేయాలని షరతు పెట్టింది భారత ప్రభుత్వమేనని గుర్తుచేశారు. భారతీయ భాగస్వామి ఎలా లైసెన్సు పొందాడన్నది విదేశీ సంస్థకు తెలియదన్నారు. నాటి సుప్రీం తీర్పుతోనే భారతదేశంలో ఆర్థిక మందగమనానికి బీజం పడిందన్నారు. 
 
సుప్రీంకోర్టు ఒక్క కలం పోటుతో వందకు పైగా స్పెక్ట్రమ్ లైసెన్సులను రద్దు చేయడం వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.1.76 లక్షల కోట్ల నష్టం జరిగిందని కాగ్‌ వేసిన తప్పుడు అంచనాల ఆధారంగా సుప్రీంకోర్టు లైసెన్సుల రద్దు నిర్ణయం తీసుకుందన్నారు. అప్పట్లో తాను 11 టెలికాం కంపెనీల తరపున వాదించానని గుర్తుచేశారు. 
 
బొగ్గు కుంభకోణం విషయంలోనూ ఇలాంటి తప్పిదమే జరిగిందన్నారు. ప్రతీ కేసును విడిగా చూడకుండా ఒక్క కలంపోటుతో మొత్తం బొగ్గు లైసెన్సులను రద్దు చేశారని గుర్తుచేశారు. వ్యాపార సంబంధమైన కేసులను డీల్‌ చేసే నైపుణ్యం భారత సుప్రీంకోర్టుకు లేదని హరీశ్‌ సాల్వే సంచలన వ్యాఖ్యలు చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు