కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి చిదంబరానికి సుప్రీంకోర్టు తేరుకోలేని షాకిచ్చింది. ఐఎన్ఎక్స్ మీడియా స్కామ్ కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయలేమని తేల్చి చెప్పింది. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ తనను అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తునదని, తనకు బెయిల్ ఇవ్వాలంటూ చిదంబరం పిటిషన్ పెట్టుకున్నారు.
కేసు దర్యాప్తు ఆరంభదశలో ఉన్నప్పుడు బెయిల్ ఇవ్వడం వల్ల ఆ కేసు విచారణ మందగిస్తుందని కోర్టు అభిప్రాయపడింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఆర్థిక నేరాలు భిన్నమైనవని, వాటిని దర్యాప్తు చేసేందుకు పద్ధతులు కూడా భిన్నంగా ఉంటాయని కోర్టు స్పష్టం చేసింది.
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరం మనీల్యాండరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ కేసులో ఇప్పటికే చిదంబరం సీబీఐ కస్టడీలో ఉన్నారు. ఆగస్టు 21న రాత్రి హై డ్రామా మధ్య చిదంబరాన్ని సీబీఐ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కాగా, ఇప్పటికే చిదంబరం వద్ద ఈడీ అధికారులు విచారణ జరిపిన విషయం తెల్సిందే.