నేడు సుప్రీంలో ఎన్సీపీ నేత మహ్మద్ ఫైజల్ అనర్హత కేసు

మంగళవారం, 28 మార్చి 2023 (09:50 IST)
సుప్రీంకోర్టులో ఎన్.సి.పికి చెందిన మాజీ ఎంపీ మహ్మద్ ఫైజల్‌పై అనర్హత వేటు వేసిన కేసులో చేసిన అప్పీల్ పిటిషన్‌పై తుది తీర్పు మంగళవారం వెలువడనుంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై పరువు నష్టం దావా కేసులో సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా ఆయన లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు పడింది. దీనిపై దేశ వ్యాప్తంగా దుమారం చెలరేగుతుంది. 
 
ఇలాంటి తరుణంలో ఇలాంటి కేసు ఒకటి మంగళవారం సుప్రీంకోర్టు ముందుకు వస్తుండగా, దీనిపై సర్వత్రా ఉత్కంఠ రేపుతుంది. ఇప్పటికే అనర్హత వేటు పడిన లక్షద్వీప్‌ మాజీ ఎంపీ, ఎన్‌సీపీ నేత మహ్మద్‌ ఫైజల్‌ దాఖలుచేసిన పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. దిగువ కోర్టు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చిన నేపథ్యంలో తనను అనర్హుడిగా ప్రకటిస్తూ.. లోక్‌సభ సచివాలయం జారీ చేసిన నోటిఫికేషన్‌పై ఫైజల్‌ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 
 
గతంలో కేరళ హైకోర్టు స్టే విధించినప్పటికీ తన సభ్యత్వాన్ని లోక్‌సభ సచివాలయం పునరుద్ధరించలేదని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఫైజల్ దాఖలు చేసిన పిటిషన్‌పై సీజేఐ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ పి.ఎస్‌.నరసింహా, జస్టిస్‌ జె.బి.పార్దీవాలా ధర్మాసనం విచారించనుంది. తనపై లోక్‌సభ సచివాలయం విధించిన అనర్హతను వెంటనే తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని ఫైజల్‌ కోరుతున్నారు. దీనిపై సుప్రీంకోర్టు వెలువరించే తీర్పు రాహుల్‌ గాంధీ కేసుపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనన్న చర్చ సాగుతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు