చెన్నై నుంగంబాక్కం రైల్వే స్టేషన్‌లో దారుణంగా హత్యకు గురైన టెక్కీ స్వాతి హత్య కేసులో సీబీఐ విచారణ లేదని తేలిపోయింది. స్వాతి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు శుక్రవారం కొట్టిపారేసింది. గత జూన్ 24వ తేదీ ఉదయం నుంగంబాక్కం రైల్వేస్టేషన్‌లో స్వాతి హత్యకు సంబంధించి సెంగోటకు చెందిన రాంకుమార్ అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు.
ఈ నేపథ్యంలో స్వాతి కేసులో నిందితులను రక్షించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారని, అమాయకుడైన తన కొడుకును అరెస్టు చేసారని, దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ రాంకుమార్ తల్లి పుష్పం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. స్వాతి హత్య కేసును సీబీఐ విచారణకు బదిలీ చేయాల్సిన అవసరం లేదని పుష్పం పిటిషన్‌ను తోసిపుచ్చారు.