మారుతున్న రంగులు... కాషాయంలోకి అన్నాడీఎంకే బోర్డులు

శుక్రవారం, 13 అక్టోబరు 2017 (06:43 IST)
తమిళనాడులోని అధికార అన్నాడీఎంకే కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ చేతిలో కీలుబొమ్మలా మారింది. ఇందుకోసం ఆ పార్టీ నేతలు ఊసరవెల్లిలా మారి తమ రంగులను కూడా మార్చుకుంటున్నారు. దీనికి కారణం.. అధికార పార్టీ ఏర్పాటుచేసిన హోర్డింగ్‌లు కాషాయ రంగులో కన్పించడమే. తాజాగా కనిపించిన ఈ రంగు మార్పు సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. 
 
ముదురు ఆకుపచ్చ రంగుల్లో ఉండే అన్నాడీఎంకే ప్రకటన బోర్డులు, హోర్డింగ్‌లు ఇపుడు కాషాయం రంగుల్లో కనిపిస్తుండటంతో అన్నాడీఎంకే.. భాజపాతో పొత్తు పెట్టుకుంటోందనే విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రాంలో ప్రబలుతున్న డెంగీ జ్వరాలపై అవగాహన కల్పించేందుకు అన్నాడీఎంకే ప్రభుత్వం హోర్డింగ్‌లు ఏర్పాటు చేస్తోంది. ఇవన్నీ కాషాయం రంగులోనే దర్శనమిస్తున్నాయి. 
 
నిజానికి ముదురు ఆకుపచ్చ రంగు అంటే ఆ పార్టీ ముఖ్యమంత్రి దివంగత జయలలితకు అమితమైన ఇష్టం. ఆమె జీవించి ఉన్నంత కాలం ధరించే దుస్తుల్లోనేకాకుండా, వాడే పెన్ను, కూర్చొనే కుర్చీ, ఇలా ప్రతిదీ ఆకుపచ్చ రంగులోనే ఉండేది. ఆమె మరణాంతరం అన్నాడీఎంకే అనేక రకాల పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆ పార్టీ ప్రస్తుతం అంతర్గత సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. 
 
ఈనేపథ్యంలో అన్నాడీఎంకే ఏర్పాటు చేసే హోర్డింగ్‌లకు కాషాయపు రంగు ఉండటంతో ఇపుడు చర్చనీయాంశంగా మారింది. దీంతో అన్నాడీఎంకే భాజపాతో పొత్తుకు ఇది సంకేతమని ప్రతిపక్ష డీఎంకే ఆరోపిస్తోంది. మరోవైపు ఉపముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. దీంతో ఈ ఊహాగానాలు మరింత బలపడుతున్నాయి. అయితే, భాజపాతో ఎలాంటి పొత్తు లేదని.. అంతేగాక హోర్డింగ్‌లలో వాడిన రంగు కాషాయం కాదని ఎరుపు రంగు అని అన్నాడీఎంకే నేతలు వివరణ ఇవ్వడం గమనార్హం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు