తమిళనాడు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టడంతో కరోనా లాక్డౌన్ మార్గదర్శకాలను సడలిస్తోంది. ఇందులోభాగంగా, వంద శాతం ప్రేక్షకులతో సినిమాల ప్రదర్శనకు అనుమతి ఇచ్చింది. సంక్రాంతి నుంచి 100 శాతం ప్రేక్షకులతో సినిమా ప్రదర్శనలు నిర్వహించుకోవచ్చంటూ ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే స్టార్ హీరోలు విజయ్, సింబు వంటి ప్రముఖ నటులు థియేటర్లలో పూర్తిస్థాయి సీటింగ్‌కు అనుమతి ఇవ్వాలంటూ తమిళనాడు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. విజయ్ ఈ అంశంలో సీఎం పళనిస్వామిని కలిసి నిబంధనలు సడలించాలని కోరారు. సినీ రంగం నుంచి వస్తున్న వినతులను పరిగణనలోకి తీసుకున్న అన్నాడీఎంకే సర్కారు సానుకూల నిర్ణయం తీసుకుంది.
థియేటర్లు, మల్టీప్లెక్సులు ఇకపై 100 శాతం ప్రేక్షకులతో ప్రదర్శనలు నిర్వహించుకోవచ్చని తెలిపింది. కరోనా మార్గదర్శకాలు పాటించడం తప్పనిసరి అని స్పష్టం చేసింది. ప్రేక్షకుల్లో అవగాహన కలిగించాల్సిన బాధ్యతను సినిమా థియేటర్ల యాజమాన్యాలు స్వీకరించాలని పేర్కొంది. సినిమా ప్రదర్శనల సమయంలోనే కరోనా మార్గదర్శకాలను కూడా ప్రదర్శించాలని ఆదేశించింది.