దినకరన్ చేతులకు సంకెళ్లు వేయండి.. ఆదేశించిన తమిళనాడు సీఎం?

ఆదివారం, 6 ఆగస్టు 2017 (11:07 IST)
అన్నాడీఎంకే ఉపప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ పార్టీ ప్రధానకార్యాలయానికి వస్తే అరెస్టు చేయాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగానే కాకుండా హోంశాఖను కూడా పర్యవేక్షిస్తున్న సీఎం పళనిస్వామి.. ఈ మేరకు ఆ రాష్ట్ర పోలీసులకు ఆదేశించినట్టు వస్తున్న వార్తలు ఇపుడు సంచలనం రేపుతున్నాయి. 
 
దీంతో రాయపేటలోని పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు వీలుగా భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మొహరించారు. ఒకవేళ దినకరన్ పార్టీ కార్యాలయానికి వస్తే, అరెస్ట్ చేయాలంటూ ముఖ్యమంత్రి పళనిస్వామి ఆదేశాలు జారీ చేశారు. దినకరన్‌ను ఎట్టి పరిస్థితుల్లో పార్టీ కార్యాలయంలోకి అడుగుపెట్టనివ్వబోమని పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాలు హెచ్చరిక జారీ చేశాయి.  
 
మరోవైపు ముఖ్యమంత్రి వ్యూహాన్ని పసిగట్టిన దినకరన్ తన వైఖరిని మార్చుకున్నారు. పార్టీ కార్యాలయానికి వెళ్లాలన్న ఆలోచనను దినకరన్ పూర్తిగా ఉపసంహరించుకున్నారు. అదేసమయంలో నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఈ నెల రోజుల్లో అన్ని జిల్లాల్లో ఆయన బహిరంగ సభలు నిర్వహిస్తూ పార్టీ శ్రేణులను కలుసుకోనున్నారు. 

వెబ్దునియా పై చదవండి